మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (08:14 IST)

బొమ్మ పడే విషయంపై జూన్ నెలాఖరులో తుది నిర్ణయం : ప్రకాష్ జావదేకర్

సినిమా థియేటర్లను తెరిచే అంశంపై జూన్ నెలాఖరులో తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి ప్రకాష్ జావదేకర్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లు, మాల్స్ మూతపడివున్నాయనీ వీటిని తెరిచే అంశంపై ఈనెలాఖరులో కీలక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
 
దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే విషయమై జూన్ తర్వాత మాత్రమే ఆలోచిస్తామన్నారు. ఈ నెలలో కోవిడ్ కేసుల సంఖ్యను, పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. సినిమా రంగంలోని వివిధ సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన మంత్రి వివిధ అంశాలపై చర్చించారు. 
 
లాక్డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సినిమా థియేటర్లను తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లాక్డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ రోజుకు రూ.30 కోట్లకు పైగా నష్టపోతున్నప్పటికీ లాక్డౌన్‌పై సినీరంగం సంఘీభావంగా ఉందని మంత్రి ప్రశంసించారు. సినీ సంఘాల ప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చిన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి ప్రకాశ్ జావదేకర్ హామీ ఇచ్చారు.