శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే ఉరితీస్తాం : ఢిల్లీ హైకోర్టు

ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే నిస్సందేహంగా ఉరితీస్తామంటూ ఢిల్లీ హైకోర్టు కఠువైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా, ఆక్సిజన్ సరఫరా అడ్డుకునే చర్యల్లో పాల్గొనే వారిలో అది కేంద్ర ప్రభుత్వోద్యోగులైనా, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులైనా, స్థానిక సంస్థల సిబ్బంది అయినా.. కఠిన చర్యలు తప్పవు. జీవించడం అనేది ప్రజల ప్రాథమిక హక్కు. ఆ హక్కును కాలరాసే చర్యలను సహించేది లేదు అని హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
కరోనా గుప్పిట్లో చిక్కుకుపోయిన ఢిల్లీ నగరంలో.. ఆస్పత్రుల్లో సమయానికి ఆక్సిజన్‌ అందక కొవిడ్‌ రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణవాయువు సరఫరాలో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. మహారాజా అగ్రసేన్‌ ఆస్పత్రి, జైపూర్‌ గోల్డెన్‌ ఆస్పత్రి, బాత్రా ఆస్పత్రి, సరోజ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. 
 
శనివారం కోర్టుకు సెలవు ఉన్నా.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా జస్టిస్‌ విపిన్‌ సంఘి, జస్టిస్‌ రేఖ పల్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆస్పత్రులకు సరఫరా అయ్యే ఆక్సిజన్‌ను అడ్డుకునేవారిని ఉపేక్షించేది లేదని బెంచ్‌ స్పష్టం చేసింది. కేంద్ర అధికారులు ఎవరైనా అడ్డుకుంటే.. కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ఢిల్లీ సర్కారును ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వానికీ పలు ఆదేశాలు జారీ చేసింది. 
 
'ఇది సెకండ్‌ వేవ్‌ కాదు..! కరోనా సునామీ..! ఐఐటీ-కాన్పూర్‌ అంచనాలు, అధ్యయనాల మేరకు మే నెల ద్వితీయార్థంలో కేసులు తీవ్ర స్థాయిలో ఉంటాయని మేం చదివాం. అందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధత ఎలా ఉంది? ఆస్పత్రులు, ఆక్సిజన్‌, బెడ్‌లు, వెంటిలేటర్లు, ఔషధాలు వంటి వనరులు, వైద్య సిబ్బంది, వ్యాక్సిన్‌లు.. వీటిని ఎలా సమకూర్చుకుంటోంది. డిమాండ్‌కు తగ్గట్లుగా సేవలు అందించగలదా?' అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ, వీటికి సంబంధించి ఈ నెల 26న (సోమవారం) జరగనున్న తదుపరి దర్యాప్తులో సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించింది.
 
అలాగే, ఆక్సిజన్‌ కొరతపై 10 మంది ఐఏఎస్‌లు, 28 మంది ఐపీఎస్‌లతో ఏర్పాటు చేసిన బృందం వివరాలను ఆస్పత్రులకు అందజేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ‘‘కరోనా ప్రాణాంతక వైరస్‌ కాదు. అయితే.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపట్ల ప్రాణాంతకమవుతోంది. అలాంటి వారిని కాపాడుకోవాలి. వారికి జీవించే హక్కును కల్పించాలి. కరోనా మరణాల రేటును తగ్గించాలి. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషిచేయాలి’’ అని వ్యాఖ్యానించింది.