పరాయి మహిళతో వివాహేతర సంబంధం.. భర్తను అడ్డంగా నరికేసిన భార్య
వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య నరికి చంపేసింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిక్కమాగళూరు జిల్లా హోస్‌పేటకు చెందిన చంద్ర గౌడ (54) భార్య ఇంద్రమ్మతో కలిసి నివసించేవాడు. ఐతే భార్య ఉన్నప్పటికీ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు చంద్రగౌడ. గతంలో ఓ కాఫీ ప్లాంటేషన్‌లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ పరిచయమైంది. ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది.
చంద్రగౌడ జీవితంలోకి వచ్చిన ఈ మహిళ.. వారి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. వీరిద్దరి వివాహేతర సంబంధం గురించి భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. పూర్తిగా ప్రియురాలి మోజులో పడిన చంద్రగౌడ.. భార్య దగ్గరకు వెళ్లడం మానేశాడు. దాదాపుగా ఏడాది పాటు అసలు భార్య దగ్గరకు వెళ్లలేదు. ఈ క్రమంలో భర్తపై కోపం పెంచుకుంది ఇంద్రమ్మ.
తనకు అన్యాయం చేసి మరో మహిళలతో ఉంటున్నాడనే ఆగ్రహంతో ఊగిపోయేది. ఈ క్రమంలో మంగళవారం భార్య వున్న గ్రామానికి వెళ్లాడు చంద్రగౌడ. ఆ రోజు రాత్రి ఆమె ఇంట్లోనే ఉన్నాడు. అప్పటికే భర్తపై పీకలదాక కోపంతో ఉన్న ఇంద్రమ్మ.. చంద్రగౌడ్‌ను చంపేయాలని ప్లాన్ చేసింది. అందుకు ఇదే మంచి సమయమని భావించి పథకాన్ని పక్కాగా అమలు చేసింది.
రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత.. చంద్రపై కత్తితో దాడి చేసింది. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంద్రమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.