బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (17:46 IST)

అక్రమ సంబంధం పెట్టుకుందనీ.. బాలుడుని భుజాలపై మోపించి హింసించారు..

కట్టుకున్న భర్తను వదిలిపెట్టి.. మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ తమ కుటుంబ పరువు తీసిందన్న అక్కసుతో ఓ మహిళను ఆమె అత్తింటి కుటుంబ సభ్యులు చిత్రహింసలకు గురిచేశారు. వారికి గ్రామస్థులు కూడా చేతులు కలిపారు. అలా ఆ మహిళను చిత్ర హింసలు పెట్టారు.  ఓ బాలుడుని ఆమె భుజాలపై కూర్చోబెట్టి ఏకంగా మూడు కిలోమీటర్ల దూరం వరకు నడిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు సమీపంలో ఉన్న గునా జిల్లాలో ఒక మహిళ కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భర్తను విడిచి మరో వ్యక్తితో కలిసి జీవిస్తోంది. ఇది అత్తింటివారికి ఏమాత్రం నచ్చలేదు. ఈ చర్య వల్ల తమ కుటుంబ పరువు పోయిందని భావించారు.
 
దీంతో గ్రామస్థులు, అత్తింటివారు కలిసి ఆమెకు బుద్ధి చెప్పాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అంతా చుట్టూ చేరి ఆమెపై బెదిరింపుల‌కు పాల్ప‌డి ఓ బాలుడిని భుజాలపై మోస్తూ శిక్ష అనుభ‌వించాల‌ని చెప్ప‌డంతో ఆమె వారిని ఎదిరించ‌లేక‌పోయింది.  
 
ఆమెను ఇలా ఊరేగిస్తూ, కొడుతూ, చిత్రహింసలు పెట్టే దృశ్యాలను కొంద‌రు స్మార్ట్ ఫోన్లలో తీశారు. ఆమెను అవ‌మానిస్తూ గ్రామ‌స్థులు, అత్తింటివారు పాల్ప‌డిన ఈ ఘ‌ట‌నకు సంబంధించిన స‌మాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పోలీసులు దీనిపై కేసు న‌మోదు చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.