ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (18:23 IST)

ఓలా.... ఎందుకిలా...? మహిళా సీఈఓని తీస్కెళ్లి చీకట్లో...

క్యాబ్ డ్రైవర్లు ప్రవర్తించే దారుణమైన తీరును ఇప్పటికే చాలాచోట్ల చాలామంది ప్రస్తావించారు. మరికొన్ని చోట్లు డ్రైవర్లు మహిళలపై అఘాయిత్యాలు చేసిన దాఖలాలు వున్నాయి. బెంగళూరులో ఆలస్యంగా మరో ఘటన వెలుగు చూసింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓలా క్యాబ్ బుక్ చేసుకున్న గార్మెంట్ కంపెనీ మహిళా సీఈఓకి ఓలా క్యాబ్ డ్రైవర్ చుక్కలు చూపించాడు. ఈ ఘటన ఈ నెల 10న జరిగింది. 
 
వివరాలు చూస్తే... సీఈఓ విమానాశ్రయం నుంచి ఇంటికి ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారు. క్యాబ్ డ్రైవర్ పికప్ చేస్కున్నారు. ఆ తర్వాత ఓలా రూట్ మ్యాప్ ద్వారా కాకుండా మరో మార్గానికి కారును మళ్లించాడు. దీనితో భయపడిపోయిన మహిళా సీఈఓ కారును రూట్ మ్యాప్ ప్రకారమే పోనివ్వాలని కోరారు. ఐతే సదరు డ్రైవర్ ఆమె మాటలు పట్టించుకోకుండా అలా పోనిస్తూనే వున్నాడు. దీనితో ఆమె ఓలా ఎమర్జెన్సీ నెంబరుకి కాల్ చేసి విషయం చెప్పగా వారు సదరు డ్రైవరుతో చెప్పి ఆమె చెప్పినట్లే వెళ్లాలని సూచించారు. దాంతో కారును తిరిగి రూట్ మ్యాప్ ప్రకారం నడుపుతూ సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం మొదలెట్టాడు. 
 
డ్రైవ్ చేస్తూ మొబైల్ ఫోన్ మాట్లాడవద్దని ఆమె చెప్పగా... ఆగ్రహంతో ఊగిపోయిన సదరు డ్రైవర్ ఆమెను ఓ చీకటి ప్రదేశానికి  తీసుకెళ్లి కారును నిలిపివేశాడు. ఈ ఘటనతో ఆమె మరింత భయపడిపోయి వెంటనే ఓలా నెంబరికి ఫోన్ చేస్తే ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు. పోలీసులకు చెపుదామని ప్రయత్నించినా అది కూడా సాధ్యం కాలేదు. మరోవైపు ఫోన్ చార్జ్ కూడా అయిపోయింది. దీనితో తీవ్రమైన భయంతో సదరు మహిళ ఎలాగోలా ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత ఓలా డ్రైవరుపై ఫిర్యాదు చేయగా యాజమాన్యం పట్టించుకోలేదని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.