బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (09:23 IST)

ప్రపంచవ్యాప్తంగా తెలుగు వికీపీడియా సత్తా

ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో తెలుగు వికీపీడియా మిగిలిన భాషల్లో ఉన్న వికీపీడియాలతో పోటీపడి మూడో స్థానం దక్కించుంది. ఈ పోటీలలో వీవో భాష వికీపీడియా మొదటి స్థానం దక్కించుకోగా.. ఇంగ్లీష్‌ రెండోస్థానంలో నిలిచింది. వికీపీడియాలోని వ్యాసాలకు చిత్రాలు ఉంచేందుకు ఏటా జులై, ఆగస్టు నెలల్లో నిర్వాహకులు 'వికీపీడియా పేజెస్‌ వాంటింగ్‌ ఫొటోస్‌' పేరిట పోటీని నిర్వహిస్తారు.

ఈ రెండు నెలల్లో తెలుగు రచయితలు సుమారు 22,700 గ్రామాలకు సంబంధించిన వ్యాసాలకు మ్యాపులను అప్‌లోడ్‌ చేయగలిగారు. దీంతో అత్యధిక ఫొటోలు అప్‌లోడ్‌ చేయడంలో తెలుగు మాధ్యమం మూడోస్థానం దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో ఎపి, తెలంగాణలోని 30వేల గ్రామాలకు సంబంధించి వ్యాసాలు ఉండగా, ఆయా ప్రాంతాల విద్య, వైద్య, రవాణా, దర్శనీయ ప్రదేశాలు తదితర సమాచారం అందుబాటులో ఉంది.

కొత్తగా వికీపీడియాలో చేరిన ఔత్సాహిక రచయితలు te.wikipedia.org  వెబ్‌సైట్‌లోకి వెళ్లి వర్గం: ఆంధ్రప్రదేశ్‌ గ్రామాలు, వర్గం:తెలంగాణ గ్రామాలు అని వెతికి ఆయా ప్రాంతాల సమాచారం చూసే వీలుంది. ప్రస్తుతం దేశంలో 75వ స్వాతంత్య్ర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తెలుగు రచయితలు స్వాతంత్య్ర పోరాటం, 75ఏళ్ల ప్రస్థానంపై ఏడాదిలోగా 3వేల వ్యాసాలు రాయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.