1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (10:33 IST)

దేవీ నవరాత్రులు ప్రారంభం.. శైలపుత్రిగా బెజవాడ కనకదుర్గమ్మ.. ఇలాచేస్తే?

Sailaputri
Sailaputri
తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. 
 
తెలంగాణలో మాత్రం బతుకమ్మ సంబురాలను జరుపుకుంటారు. పదో రోజున విజయ దశమి వేడుకలను నిర్వహిస్తారు. దసరా పండుగ రోజున బెజవాడ దుర్గమ్మ రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. 
 
మరోవైపు తిరుమల, విజయవాడలో బ్రహ్మోత్సవాలను సైతం ఘనంగా నిర్వహిస్తారు. ఇవేకాదు శ్రీశైలం మల్లన్న, బాసర, ఆలంపూర్ వంటి పుణ్యక్షేత్రాల్లోనూ నవరాత్రుల వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
 
ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రులు అశ్విని మాసంలోని శుక్ల పక్షంలో ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శారద నవరాత్రులు సెప్టెంబర్ 26వ తేదీ ఈ రోజున ప్రారంభం అయాయి. తొమ్మిది రోజుల ఉత్సవాల అనంతరం అక్టోబర్ 5వ తేదీన విజయదశమి (దసరా) వేడుకలతో ముగుస్తాయి. 
 
ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో దుర్గామాత మానవాళి సంక్షేమానికి కృషి చేస్తుందని చాలామంది విశ్వసిస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి.
 
ఈసారి నవరాత్రుల వేళ సర్వార్ధ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగంతో సెప్టెంబర్ 26న ప్రారంభం అయ్యాయి. ఈ రెండు శుభ యోగాల సమయంలో అమ్మవారికి పూజలు చేస్తే ఎలాంటి కష్టాల నుండైనా విముక్తి లభిస్తుందని విశ్వాసం. శైలపుత్రి ముందు నెయ్యి దీపం వెలిగించి ఉత్తరం వైపున ఉన్న ఆసనంపై కూర్చొని, ఓం శైలపుత్రీ యే నమః అంటూ మంత్రాన్ని 108 సార్లు జపించండి. 
 
జపం చేసిన తర్వాత లవంగాలను మాలగా కట్టి అమ్మవారికి దండగా సమర్పించండి. ఈ విధంగా చేయడం వల్ల మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కుటుంబ కలహాలు కూడా శాశ్వతంగా దూరమవుతాయి. అమ్మవారికి రెండు పూటలా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చెయ్యటం సత్ఫలితాలు లభిస్తాయి.  
 
ఇకపోతే.. అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో విజయదశమి ఉత్సవాలు అంగరంగవైభవంగా మొదలయ్యాయి. ఇవాల్టి నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీశైల మహా క్షేత్రంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 
 
ఇవాళ ఉదయం ఉత్సవాల ప్రారంభ పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ రోజు సాయంత్ర శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ  శరన్నవరాత్రుల్లో  మొదటి రోజు శైలపుత్రిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. కొన్ని ప్రాంతాలలో మొదటిరోజు అనగా ఆశ్వయుజ పాడ్యమి రోజు శ్రీ దుర్గాదేవిగా పూజిస్తారు