శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (20:29 IST)

ముక్కోటి ఏకాదశి: తులసీ దళాలతో పూజ మరవకూడదట..!

ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో వస్తే కనుక ఆ ఏకాదశిని మోక్షదైకాదశి అని అంటారు. దీనినే ముక్కోటి ఏకాదశి అంటారు. పూర్వం వైఖానసుడు అనే ఒక రాజు తన తండ్రిని నరకలోకం నుంచి తప్పించేందుకు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించాడట. అతని వ్రత ఫలితంగా తండ్రి నరకం నుంచి విడుదలై స్వర్గలోకానికి చేరుకున్నాడట. అందుకని ఈ ఏకాదశికి మోక్షదైకాదశి అన్న పేరు వచ్చింది. 
 
వైకుంఠ ఏకాదశినాడు వైష్ణవాలయాల్లో ప్రత్యేకంగా తెరిచి ఉంచే వైకుంఠ ద్వారంగుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురుచూస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు, శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. ఏకాదశినాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశినాడు స్వామివారి పుష్కరణిలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పుణీతులవుతారు.
 
ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. శుచిగా స్నానమాచరించి.. స్నానానంతరం పూజాగదిని శుభ్రపరచుకుని తోరణాలతో అలంకరించాలి. వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి, ఆయన ప్రతిమను కొలుచుకోవాలి. పూలతో పాటుగా హరికి ప్రీతిపాత్రమైన తులసీదళాలతో ఆ స్వామిని పూజించుకోవాలి.
 
ఈ రోజున విష్ణుమూర్తిని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలగడంతో... తమలాగానే వైకుంఠద్వారాన్ని పోలిన ద్వారం ద్వారా హరిని దర్శించుకునేవారికి మోక్షం కలగాలని వారు కోరుకున్నారట. 
 
ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి.. ఇహలోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకి పరిపక్వత కలిగించమంటూ ఆ భగవంతుని వేడుకోవడం ఈ ఉత్తర ద్వార దర్శనంలోని ఆంతర్యంగా కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ గుడికి వెళ్లడం కుదరని పక్షంలో ఆందోళన చెందకుండా, ఉన్నచోటే ఆ హరిని ధ్యానించుకుంటూ తనలోని అజ్ఞానాన్ని తొలగించి, శాశ్వతమైన శాంతిని ప్రసాదించమని వేడుకోవాలంటూ ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
Tulasi
 
ఏడాది పొడవునా ఏ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం కుదరకున్నా, ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అపార ఫలితం దక్కుతుందంటారు. ఈ ఏకాదశి రోజున ఇంద్రియాలనూ ఆ హరికి అర్పించే అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం. ఇందుకోసం ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి, ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్నే స్వీకరిస్తూ, మర్నాడు ఉదయం ఎవరికన్నా అన్నదానం చేసిన పిదప భుజించాలి. 
 
ఏకాదశి రోజు రాత్రి భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఇలా జాగరణతో మనసునీ, ఉపవాసంతో శరీరాన్నీ అదుపు చేసుకుని... వాటిని హరిధ్యానంలోకి మరల్చడమే ఏకాదశి వ్రత ఉద్దేశమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.