సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

సుందరకాండ పారాయణంతో సకల శుభాలు మీ సొంతం..

అనారోగ్య సమస్యలు, ఆర్థిక బాధలు, ఈతి బాధలు, కుటుంబ సమస్యలు, కార్యజయం, చదువులో అత్యున్నత స్థానానికి ఎదగాలనుకునేవారు, వివాహం కానివారు, సంతాన ప్రాప్తి, నవగ్రహదోషాలు ఇలా రకరకాల సమస్యలకు సుందరకాండ పరమౌషధం అని పండితులు చెప్తున్నారు. ఇలాంటి వారు సుందరకాండ పారాయణం చేయడం ఉత్తమం. 
 
పారాయణం చేయించుకోవడం ఇబ్బంది ఉంటే సుందరకాండ పుస్తకాన్ని కొనుక్కొని ప్రతీరోజు ఒక పుష్పం దానిపై ఉంచి ప్రార్థన చేసినా మీకు తప్పక మంచి జరుగుతుందని శాస్త్రవచనం. ఇక ఆలస్యమెందుకు అన్ని బాధలు తీరడానికి భక్తితో, శ్రద్ధతో సుందరకాండ పారాయణం చేయండి. సకల శుభాలను పొందవచ్చు.
 
సుందరే సుందరో రామః సుందరే సుందరీకథా
సుందరే సుందరీ సీతా సుందరే వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః
సుందరే సుందరం మంత్రం సుందరే కింన సుందరమ్
 
శ్రీమద్రామాయణంలోని సుందర కాండ గురించిన సుప్రసిద్ధ చెందిన శ్లోకమిది. వాల్మీకి రామాయణంలో సుందరకాండకే ఎందుకు అంత ప్రాముఖ్యముందనే ప్రశ్నకు సమాధానమీ శ్లోకం. సుందరకాండలో వర్ణించిన శ్రీరామచంద్రుడు పరమ సుందరుడు, అందులోని కథ పరమ సుందరం, సీతాదేవి పరమ సుందరి, ఆమె ఉన్న వనం పరమ సుందరమైనది, కావ్యం మరింత సుందరమైనది, హనుమంతుడు సుందరుడు, మంత్రం కూడా సుందరమే. ఈ కాండలో సుందరం కానిది ఏమున్నది? అని శ్లోకార్థం.
 
సుందరకాండ ఫలశ్రుతిని గురించి రామాయణమేగాక, స్కాందపురాణం బ్రహ్మాండ పురాణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోను కనిపించడం దీని వైశిష్ట్యాన్ని చెప్తుంది. వీటిని పరిశీలించి చూస్తే వాల్మీకి ఈ కాండం నుంచి నేటి సమాజానికి కూడా పనికి వచ్చే పరమాద్భుతమైన ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడనిపిస్తుంది.
 
సుందర కాండలో హనుమంతుడే కథానాయకుడు. రామాయణంలోని ప్రతికాండలోనూ శ్రీరాముని ప్రత్యక్ష దర్శనం ఉంటుంది. ఇందులో చివర్లో మాత్రమే రామచంద్రుడు కనిపిస్తాడు.

కానీ కథంతా శ్రీరామ కార్యసాధనతో ముడిపడి ఉంటుంది. సీతాన్వేషణ నిమిత్తం బయల్దేరిన వానర వీరుల్లో దక్షిణ దిశగా పయనించిన అంగద, జాంబవంత, హనుమంతాది మహావీరులు కార్యసాధన చేసుకొని తిరిగి రాగలరన్న విశ్వాసం రామునిలో పుష్కలంగా ఉంది. అదే నిజమైంది.