మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (10:37 IST)

#WorldWaterDay2021: అబ్ధుల్ కలామే ఆ మాటన్నారు.. నీటిని రక్షించుకుందాం..!

ప్రపంచ జల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. భూగర్భ జలాలను పెంచడం, వర్షపు నీటిని ఒడిసిపట్టి జలాలను సక్రమంగా వినియోగించడం, దుర్వినియోగాన్ని నిరోధించి, నీటి విలువను తెలియజేస్తూ భావితరాలకు తాగు, సాగునీరు లభ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాల్సి ఉందని పర్యావరణ పరిరక్షకులు అంటున్నారు. నీటి వనరులను కాపాడుతామని.. జలాన్ని వృధా చేయమని ప్రతి పౌరుడు వాగ్ధానం చేయాలని పర్యావరణ పరిరక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు.  
 
ఇకపోతే.. ప్రపంచ జల దినోత్సవం ఐరాస జరిపే వార్షిక దినోత్సవం. దీన్ని ఏటా మార్చి 22 న జరుపుతారు. ఇది మంచినీటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మంచినీటి వనరుల స్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈ రోజును ఉపయోగిస్తారు. 1992 బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సమావేశం ఎజెండా 21లో ఈ దినోత్సవాన్ని మొదట ప్రతిపాదించారు. తొలి ప్రపంచ నీటి దినోత్సవం 1993లో జరిగింది. ఈ రోజున పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతలకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.
 
నీటితో జీవం అంకురించింది. ప్రకృతి మనుగడ  నీటితోనే కొనసాగుతోంది. జీవవైవిధ్య పరిరక్షణ.. జీవం జలంతోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ తెలిసినా..నీటిని వృధా చేస్తున్నాం..నీటి వనరుల్ని వ్యర్థాలతో కలుషితం చేసేస్తున్నాం. ప్రపంచంలో కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతుంటే..మనకు అందుబాటులో ఉన్న నీటిని వృధా చేస్తున్నాం.  
water
 
ఈ పరిస్థితి ఇలాగే  కొనసాగితే..2050 నాటికి ఈ భూమ్మీద తాగడానికి పుష్కలమైన నీరు  ఉండనే ఉండదని..ప్రజలు స్నానాలు చేయడం మానేసి శరీరానికి రసాయనిక లేపనాలు రాసుకుంటారనీ..(కెమికల్ బాత్) వాటితోనే స్నానాలు చేస్తారనీ..దేశ సరిహద్దుల్లో కాపలా కాయాల్సిన  సైనికులు నీటి వనరుల చుట్టు కాపలా కాసా పరిస్థితి ఉంటుందని.. తలంటు కోవడానికి నీరు సరిపోక ప్రజలందరూ బోడి గుండుతో జీవిస్తారనీ, స్త్రీ పురుషులందరూ రోజు తల షేవ్ చేసుకునే పరిస్థితి వస్తుందని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారంటే పరిస్థితిని ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. 
 
ఇటువంటి దారుణమైన దుస్థితి ప్రపంచంలోని ప్రజలకు రాకూడదనే ఉద్ధేశంలోనే ఐక్యరాజ్యసమితి  మార్చి 22న ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానించింది. భారత్‌లో సింధు నాగరికత, ఈజిప్టులో నైలు నది నాగరికత ఇలా ప్రపంచ నాగరికతలు నదీ తీరాలు, నీటి వనరులకు సమీప ప్రాంతంలో విలసిల్లాయి. మన చరిత్రంతా జలవనరులతోనే ముడిపడి ఉంది. నీటిని పరిరక్షించుకోవాలనే నినాదాన్ని ఈ నాగరికతలు వెల్లడించాయి.
 
భారతీయులకు నీటి విలువ తెలుసు కాబట్టే నీటిని గంగమ్మ అంటూ పూజించి, నదులకు, చెరువులకు, జలాశయాలకు హారతులిస్తారు. నారం అంటే నీరు. నీటిలో ఉంటాడు కాబట్టి శ్రీమహావిష్ణువుకు నారాయణుడు అని పేరు. నీటినే రూపంగా స్వీకరించి విష్ణువు నీటి విలువను చెప్తున్నాడు. శివుడు ఏకంగా గంగను తన తలపై ధరించి గంగాధరుడయ్యాడు. నీరు పారబోయాల్సింది కాదు, నెత్తిన పెట్టుకుని పూజించాలని సమస్త మానవాళికి సందేశం ఇచ్చాడు. ఆ సందేశాన్ని పాటించాలి. నీటిని వృధా చేయడం సృష్టికి, భగవత్తత్వానికి, సమస్త ప్రాణకోటికి వ్యతిరేకం. నీటిని కాపాడాలి, ప్రతి నీటి బొట్టూ విలువైందేనని గుర్తించుకోవాలి.