ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

గాంఢీవం గురించి తెలుసా? అర్జునునికి అది ఎలా వచ్చింది..? (video)

Gandeevam
చాలా ఏళ్ళ క్రితం శ్వేతకి అనే రాజు దుర్వాసమహర్షి పర్యవేక్షణలో ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్వహించాడు. వందేళ్ళపాటూ సాగి దిగ్విజయంగా ముగిసిన ఆ యజ్ఞం వల్ల దేవతలందరూ సంతోషించారు. కాని నిత్యం హోమగుండంలో ఆజ్యం పోయడం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి చేసింది. మొహం పాలిపోయింది. సన్నబడ్డాడు. ఆహారం పట్ల విముఖత ఏర్పడింది. 
 
ఇక లాభం లేదనుకుని అగ్ని బ్రహ్మను అర్చించి తన వ్యాధి గురించి వివరించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. "ఖాండవ వనంలో అనేక దివ్య ఓషధులు ఉన్నాయి. దేవతలకు శత్రువులైన రకరకాల జంతువులు ఉన్నాయి. నీ ప్రతాపంతో అ వనాన్ని దహించి ఆ ఓషధుల్ని స్వాహాచేసి జంతువుల్ని భక్షించు. నీ ఆరోగ్యమూ కుదుటపడుతుంది. శత్రు సంహారమూ జరుగుతుంది" అని అగ్నికి సలహ ఇచ్చాడు. 
 
సరేనని అగ్ని ఖాండవ వనానికి వెళ్ళాడు. ఆ వనంలో ఇంద్రుడి స్నేహితుడు తక్షకుడు భార్యాబిడ్డలతో వుంటున్నాడు. ఖాండవ వనాన్ని దహించడానికి అగ్ని వచ్చాడని తెలుసుకుని తన స్నేహితుడ్ని ఎలాగైనా సరే రక్షించాలనుకున్నాడు ఇంద్రుడు. అగ్ని వనదహనం ప్రారంభించగానే ఇంద్రుడు కుండపోతగా వర్షం కురిపించాడు. అంతటితో అగ్ని ప్రయత్నం విఫలమైంది. కోపంతో కణకణలాడిన అగ్నిదేవుడు ఆ వనాన్ని ఎలాగైనా స్వాహా చేయాలన్న నిశ్చయంతో వరుసగా ఏడు రోజులూ కాపు కాశాడు. ఏడు రోజులూ ఇంద్రుడు అడ్డుకున్నాడు. లాభం లేక అగ్ని వెళ్లి మళ్ళీ బ్రహ్మ దగ్గర మొరపెట్టుకున్నాడు.
 
"నరనారాయణులు భూమిపై కృష్ణార్జునులుగా జన్మిస్తారు. అప్పుడు ఖాండవ వనాన్ని దహించే అవకాశం నీకు లభిస్తుంది. అప్పటి వరకూ వేచివుండు" అని బ్రహ్మ ఉపాయం చెప్పాడు. పాండవులు ఇంద్రప్రస్థంలో ఉంటున్నప్పుడు ఒకసారి అర్జునుడు కృష్ణుణ్ణి తోడు తీసుకుని ఖాండవ వనానికి వెళ్ళాడు. యమునా తీరాన బావమరుదులిద్దరూ చల్లగాలికి సేద తీరుతుండగా అగ్ని ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి తన వ్యాధి గురించి చెప్పుకుని సహాయం కోసం అర్థించాడు. వారు సరేనన్నాకా అసలు రూపంలో ప్రత్యక్షమై ఖాండవ వనాన్ని దహించాలనే కోరికను వెళ్ళబుచ్చాడు.
 
కృష్ణార్జునులు సహాయం చేస్తామని వాగ్దానం చేశారు. అయితే ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఆయుధాలు సిద్ధంగా లేవు. అది గమనించి అగ్ని వరుణదేవుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు ప్రత్యక్షమై అగ్నిదేవుడి అభ్యర్ధన మేరకు అర్జునుడికి 'చంద్రధనస్సు' (గాండీవం) ఇచ్చాడు. చిత్రమేమిటంటే దానికి అక్షయ తూణీరం ఉంది. ఎన్ని బాణాలు తీసివేస్తున్నా అది ఖాళీ కాదు. ఎప్పుడూ శరసమృద్ధమై ఉంటుంది. 
Gandeevam
 
దానికి తోడు కపిరాజుచిత్తరువుతో వున్న ధ్వజాన్ని అమర్చిన ఒక దివ్యరథాన్ని అర్జునుడికి ఇచ్చాడాయన. ఆ రథానికి బలిష్టమైన నాలుగు తెల్లగుర్రాలు పూంచి ఉన్నాయి. నాలుగిటికీ కళ్ళేలుగా నాలుగు బంగారపు గొలుసులు ఉన్నాయి. 
 
బ్రహ్మానందం పొందిన అర్జునుడు వరుణదేవుడికి వినమ్రుడై నమస్కరించి వాటిని స్వీకరించాడు. కృష్ణార్జునులు ఖాండవ వన సరిహద్దుల్లో నిలబడి లోపలి ప్రాణులు బయటకు రాకుండా కాపలాకాస్తూ, వనాన్ని దహించమని అగ్నికి అనుమతి ఇచ్చారు. అడవిలో జంతువులు అటూ , ఇటూ పరిగెత్తి ఎటూ పోలేక అగ్ని జ్వాలలకు తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. అక్కాడ తపస్సు చేసుకుంటున్న మహర్షులు ఎటూ పోలేక తమను రక్షించమని దేవేంద్రుణ్ణి వేడుకున్నారు. క్షణంలో ఆకాశం మేఘావృతమైంది. 
 
ఉరుములూ, మెరుపులతో ధారాపాతంగా వర్షం మొదలైంది. ఆ వెంటనే అర్జునుడు ఆకాశంలోకి అంబులు విడిచి అగ్ని దహిస్తున్నంత మేరా ఒక్క వానచినుకు రాలకుండా శరచత్రం ఏర్పరిచాడు. సంతోషించిన అగ్ని మళ్ళీ విజృంభించాడు. ఆ సమయానికి తక్షకుడు లేడక్కడ. కురుక్షేత్రం వెళ్ళాడు. తక్షకుడి కొడుకు అశ్వసేనుడు మంటల్లో చిక్కుకుని గిలగిల్లాడసాగాడు. కొడుకును మంటల నుంచి రక్షించేందుకు తల్లి అతన్ని ఆసాంతం గుటుక్కున మింగి ఖాండవ వనానికి దూరంగా ఉమ్మి వేయాలనుకుంది. అర్జునుడు అది పసిగట్టాడు. కోపంతో అశ్వసేనుడి తల నరకబోయాడు. వెంటనే ఇంద్రుడు గాలి దుమ్ము రేపాడు. కళ్ళల్లోకి ధుళి పోవడం వల్ల అర్జునుడి గురితప్పింది. 
 
అశ్వసేనుడి ప్రాణాలు నిలిచాయి. అది గ్రహించి కృష్ణార్జునులు మండిపడ్డారు. అశ్వసేనుడు తలదాచుకునేందుకు మరెక్కడా చోటు లభించరాదని అగ్ని, కృష్ణార్జునులు శపించారు. పాండవ మధ్యముడు ఖాండవ వనంలో కనిపించిన ప్రతీ ప్రాణినీ నిర్దాక్షిణ్యంగా సంహరించసాగాడు. బాణాల గొడుగు చాటున అగ్ని ఖాండవవనాన్ని దహిస్తున్నాడు. అతిప్రయాసతో తప్పించుకుని బయటకు రాగలిగిన పాముల్ని, డేగల్ని అర్జునుడు ముక్కలు చేస్తున్నాడు. 
 
మరో పక్క కృష్ణుడు అసురుల్ని మట్టికరిపించాడు. చివరకు ఇంద్రుడే ఐరావతాన్ని ఎక్కి వచ్చి స్వయంగా కృష్ణార్జునులతో తలపడ్డాడు. దేవతలందరూ యుద్ధంలో ఇంద్రుడికి సహాయపడినా ఫలితం లేకపోయింది. దేవేంద్రుడు ఓడిపోయాడు. కృష్ణార్జునులు విజయం సాధించారు. ఖాండవ వనాన్ని సమూలంగా స్వాహా చేసిన అగ్ని తిరిగి ఉజ్జ్వలంగా ప్రకాశించాడు.
 
గాండీవ వనాన్ని అర్జునుడు అగ్నికి ఆహుతినివ్వడంతో అగ్నిదేవుడు సంతోషంతో అర్జునునికి గాంఢీవాన్ని ప్రసాదించాడు. గాంఢీవం- అనేది స్వర్గంలోని గాంఢీవ వృక్షం ద్వారా రూపొందించబడింది. గాంఢీవానికి తగిన రక్ష వుంది. లక్షలాది ఆయుధాలకు ఇది సమానమైనది. పలు రంగులతో కూడినది. మృదువైనది. దేవరులు, గంధర్వులు పూజించినది.
 
అలాగే వెయ్యేళ్లు బ్రహ్మదేవుని వద్ద వుండగా, ప్రజాప్రతి వద్ద 503 సంవత్సరాలు, ఇంద్రుడి వద్ద 85 సంవత్సరాలు, చంద్రుడు 500 సంవత్సరాలు, వరుణుడి వద్ద 100 సంవత్సరాలు వున్నది. ఈ విల్లును గంధర్వులు, దేవరులు పూజించారని పురాణాలు చెప్తున్నాయి.