గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఠాగూర్

#MahaShivratri అంటే ఏంటి.. శివరాత్రి మహత్యం ఏంటి?

భారతీయ సనాతన ధర్మ సంస్కృతిలో ఎన్నో పండుగ‌లు ఉన్నాయి. అందులో మ‌హా శివ‌రాత్రికి ప్ర‌త్యేక విశిష్ట‌త ఉంది. చాంద్ర‌మాన మాసంలోని 14వ రోజును(చ‌తుర్ద‌శిని) మాస శివ‌రాత్రి అంటారు. అదే మాఘ బ‌హుళ చ‌తుర్ద‌శి రోజు వ‌చ్చే శివ‌రాత్రిని మ‌హా శివ‌రాత్రి అంటారు. 
 
దీనికి ఆధ్యాత్మికంగా గొప్ప ప్రాధాన్యం ఉంది. ఈ రోజునే శివుడు లింగ‌రూపంలో ఉద్భ‌వించిన‌ట్లు పురాణాలు చెబుతున్నాయి. మ‌హాశివుడికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన ఈ రోజున‌ ఉప‌వాసం, శివార్చ‌న‌, జాగ‌ర‌ణ చేయ‌డం వ‌ల్ల ఎంతో పుణ్యం ద‌క్కుతుంది.
 
శివ‌రాత్రి రోజు స్నానం ఎంత ముఖ్య‌మో ఉప‌వాసం అంత శ్రేష్ఠ‌మైంది. అయితే కొంద‌రు రోజంతా ఉప‌వాసం ఉండి మ‌రుస‌టి రోజు ఉద‌యం భోజ‌నం చేస్తుంటారు. మ‌రికొంద‌రు శివ‌రాత్రి రోజు ప‌గ‌లంతా ఏం తిన‌కుండా ఉండి రాత్రి న‌క్ష‌త్ర ద‌ర్శ‌నం చేసుకుంటారు. ఆ త‌ర్వాత భోజ‌నం చేయ‌డం ఒక ఆచారం. దీన్నే న‌క్తం అంటారు. మ‌రికొంద‌రు ప‌గ‌టి పూట ఏదో ఒక‌టి తిని.. రాత్రి ఉప‌వాసం ఉంటారు. దీన్ని ఏక భుక్తం అంటారు.
 
అస‌లు శివ‌రాత్రి మ‌హ‌త్మ్యం అంతా రాత్రి వేళ‌ల్లోనే ఉంటుంది. అందుకే భ‌క్తులు రాత్రంతా జాగ‌ర‌ణ చేస్తుంటారు. భ‌జ‌న‌లు, పురాణ కాల‌క్షేపం లేదా శివ‌నామ‌స్మ‌ర‌ణ‌ల‌తో రాత్రంతా గ‌డుపుతారు. మ‌రికొంద‌రైతే అర్థరాత్రి లింగోద్భ‌వ కాలంలో అభిషేకాలు, అర్చ‌న‌లు చేసి మ‌హాశివుడి కృపా క‌టాక్షాలు పొందుతారు.‌ 
 
శివ‌పార్వతుల క‌ళ్యాణం కూడా ఈ రోజే జ‌రిగింద‌ని విశ్వ‌సిస్తారు. అంటే స‌తీదేవి అగ్నిప్ర‌వేశం తర్వాత హిమ‌వంతుని కుమార్తె పార్వ‌తిగా జ‌న్మించింది. ఆ త‌ర్వాత శివుని కోసం ఘోర త‌పస్సు చేసిన పార్వ‌తి.. ఇదే రోజు మ‌హాశివుడిని భ‌ర్త‌గా పొందింది.