మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : శనివారం, 5 నవంబరు 2016 (12:40 IST)

తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకేమైంది... ఆయన ఎందుకిలా చేస్తున్నారు!

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమలలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఎంతో గొప్పగా భావిస్తారు భక్తులు. శ్రీనివాసునికి ప్రతినిధిగా పనిచేయడమంటే సాదా సీదా విషయం కాదు. అలాంటిది స్వామివారికే ప్రధాన అర్చకుడంటే ఇక చెప్పనవసర

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమలలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఎంతో గొప్పగా భావిస్తారు భక్తులు. శ్రీనివాసునికి ప్రతినిధిగా పనిచేయడమంటే సాదా సీదా విషయం కాదు. అలాంటిది స్వామివారికే ప్రధాన అర్చకుడంటే ఇక చెప్పనవసరం లేదు. శ్రీనివాసుడిని తాకి, ఆయనకు సేవా కార్యక్రమాలు నిర్వహించడమంటే అది ఎన్నో జన్మజన్మల పుణ్యం. అలాంటి అవకాశాన్ని ప్రస్తుత రమణదీక్షితుల కుటుంబం సొంతం చేసుకుంది. 45 సంవత్సరాలుగా రమణదీక్షితుల కుటుంబం స్వామివారికి సేవ చేస్తూ వస్తోంది. రమణదీక్షితులంటే భక్తులందరూ మరో దేవుడిగా భావిస్తారు. అలాంటిది రమణదీక్షితులు గత కొన్నిరోజులుగా వార్తల్లోకెక్కుతున్నారు. అసలు రమణదీక్షితులకు ఏమైంది.
 
వారం రోజుల క్రితమే మనుమడి తీసుకుని శ్రీవారి ఆలయ గర్భగుడిలోకి ప్రవేశం. తితిదే నుంచి నోటీసులు. అంతే రెండురోజుల పాటు వార్తలన్నీ రమణదీక్షితుల చుట్టూ తిరిగాయి. ఆ తర్వాత వెంటనే శ్రీవారి నామంలో గొడవ. అది కాస్త తారాస్థాయికి చేరింది. అర్చకులు, జియ్యంగార్లకు  మధ్య జరుగుతున్న అంతర్గత గొడవలు ఒక్కసారిగా బయటపడ్డాయి. 
 
వైష్ణవ సాంప్రదాయం ప్రకారం u ఆకారంలో గానీ, y ఆకారంలో కాకుండా మధ్యస్థంగా తిరుమణి ఆకారంలో శ్రీవారికి నామాన్ని పెట్టాలి. అది కూడా ప్రతి శుక్రవారం తోమాల సేవ తరువాత జరగాల్సిన కార్యక్రమం ఇది. అయితే నిన్న మాత్రం రమణదీక్షితులు వైష్ణవ సాంప్రదాయాన్ని పక్కనబెడుతూ u ఆకారాన్నే స్వామివారికి నామంగా ధరింపజేశారు.
 
దీంతో అక్కడ ప్రారంభమైంది గొడవ. స్వామివారికి చూసిన జియ్యంగార్లు రమణదీక్షితులపై వెంటనే తితిదే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నో యేళ్లుగా వచ్చిన సాంప్రదాయాన్ని రమణదీక్షితులు మంట గలిపారంటూ ఆరోపించారు. దీంతో తితిదే మరోసారి రమణదీక్షితులకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైంది. దీనిపై రమణ దీక్షితులు మొదట్లో పెద్దగా స్పందించకపోయినా ఆ తర్వాత మాత్రం తన మనస్సులోని విషయాలను మీడియా ముందు ఆవిష్కరించారు. తాను మనుమడిని తీసుకెళ్ళడం తప్పేమీ కాదని, స్వామివారికి సరిగ్గానే నామాలను ధరింపజేశానని, కావాలనే కొంతమంది తన కుటుంబాన్ని రోడ్డుకు లాగే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
 
రమణ దీక్షితులు వాదన ఎలావున్నా ఆయన ఎందుకు ప్రస్తుతం ఈ విధంగా ప్రవర్తిస్తున్నారన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రమణ దీక్షితులు ఇప్పుడో కాదు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తుంటారు. గతంలో తిరుమలకు వచ్చిన కొంతమంది ప్రముఖుల గదుల వద్దకు వెళ్ళి వాళ్ళను ఆశీర్వదించడంతో ఒక్కసారిగా టిటిడి నిబంధనలను తుంగలో తొక్కినట్లు అయిపోయింది. శ్రీవారికి సేవ చేయాల్సిన ఒక ఆలయ ప్రధాన అర్చకుడు ప్రముఖులకు సేవ చేయడం ఏమిటని టిటిడి ప్రశ్నించింది. అయితే అప్పుడు ఆయన ఆ విషయాన్ని లైట్‌ తీసుకున్నారు. 
 
ఇప్పుడు రమణ దీక్షితులు చేసిన నిర్వాకం కాస్త చినికిచినికి గాలి వానలా మారి చివరకు పెను తుఫాన్‌గా మారింది. అయితే రమణ దీక్షితులు కావాలనే ఇలాంటివి చేస్తున్నారా లేక తెలియకుండా చేస్తున్నారా అనేది టిటిడి ఉన్నతాధికారులకు అర్థం కావడం లేదు. రమణదీక్షితులకు అన్నీ తెలుసు. ఏది చేస్తే ఇబ్బంది పడతామో.. ఏది చేయకుంటే మంచి పేరు వస్తుందో ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. అన్నీ తెలిసిన వ్యక్తే ఇలా చేస్తే ఏ విధంగా రమణ దీక్షితులకు జెప్పాలో అర్థంకాని పరిస్థితిలో తితిదే ఉంది. 
 
రమణ దీక్షితుల విషయంపై జియ్యంగార్లు మాత్రం కోపంగానే తితిదే ఉన్నతాధికారులు మాత్రం ఆయనకు ఎలా నచ్చజెప్పాలా అనే విషయంపై ఆలోచిస్తున్నారు. మొత్తం మీద గత వారంరోజుల్లో తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులే ప్రసార మాథ్యమాల్లో ప్రధానంగా నిలిచారు.