మంగళవారం, 1 జులై 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 17 మే 2016 (12:10 IST)

శక్తి స్వరూపిణి అవతారంలో తిరుపతి గంగమ్మ

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో ప్రధాన ఘట్టమైన జాతర మంగళవారం జరుగుతోంది. తిరుమల వెంకన్నకు స్వయానా చెల్లెలుగా చెప్పుకునే గంగమ్మను దర్శించుకునేందుకు వందలాదిమంది భక్తులు తిరుపతికి చేరుకుంటున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి మ్రొక్కులు తీర్చుకుంటున్నారు.
 
జాతరలోనే ముఖ్యమైన రోజు మంగళవారం. జాతర చాటింపు తర్వాత వారంరోజుల పాటు భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత మంగళవారం పొంగళ్లలో అమ్మవారికి నైవేథ్యం సమర్పిస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఆలయాల వద్ద అమ్మవారికి సారెలను కానుకగా అందిస్తున్నారు. 
 
అమ్మవారికి ఉదయాన్నే ప్రత్యేక అభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు. అమ్మవారు శక్తిస్వరూపిణి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. వీఐపీలకు దేవస్థానం పాసులు మంజూరు చేయడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
జాతరలో ఏరులై పారుతున్న రక్తం
 
తిరుపతి గంగజాతరలో రక్తం ఏరులై పారుతోంది. జంతుబలి నిషేధం ఉన్నా సరే భక్తులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా ఆలయ ఆవరణలో జంతువులను బలి ఇస్తున్నారు. జంతు బలితో ఆలయ ఆవరణ మొత్తం రక్తంతో నిండిపోయింది. దేవస్థానం అధికారులు మాత్రం చూసీచూడనట్లు నడుచుకుంటున్నారు.