మంగళవారం, 1 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిన విమానం... ఆరుగురి మృతి

Helicopter crashes in plane crashGaurikund
అమెరికాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చిన్నపాటి విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలిపోవడంతో అందులోని ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు నిర్ధారించారు. 
 
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫఏ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, యంగ్స్ టౌన్-వారెన్ ప్రాంతీయ విమానాశ్రయం నుండి ఆదివారం ఉదయం ఆరుగురు ప్రయాణికులతో బయలుదేరిన సెస్నా 441 విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
 
ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని వెస్టర్న్ రిజర్వ్ పోర్ట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంతోనీ ట్రెవెనా ధ్రువీకరించారు. మృతదేహాలను ట్రంబుల్ కౌంటీ కరోనర్ కార్యాలయానికి తరలించినట్లు ఆయన వెల్లడించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
 
ప్రమాదం జరిగిన ప్రాంతం చాలా కష్టతరంగా ఉందని, అక్కడికి చేరుకోవడానికి సహాయక బృందాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని హౌలాండ్ టౌన్ షిప్ అగ్నిమాపక విభాగం చీఫ్ రేమండ్ పేస్ వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు.