ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (11:17 IST)

సర్వ దర్శనానికి మోక్షమెప్పుడో... గత 79 రోజులుగా దర్శనభాగ్యం కరువాయే..

కలియుగ వైకుంఠుడై శ్రీవేంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులు దర్శనం చేసుకునే వెసులుబాటు ఎప్పటికి లభిస్తుందోనన్న బెంగ చాలా మంది భక్తుల్లో నెలకొంది. కరోనా వైరస్, కరోనా లాక్డౌన్ కారణంగా గత 79 రోజులుగా సర్వదర్శనాన్ని నిలిపివేశారు. 
 
కరోనా రెండో దశ విజృంభణ కారణంగా ఏప్రిల్ 12 నుంచి సర్వదర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. ఇప్పటివరకు వాటిని పునరుద్ధరించకపోవడంతో పేదలు, సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
 
మరోవైపు, ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ తగ్గించింది. మే నెలలో రోజుకు 15 వేల టికెట్లను మాత్రమే జారీ చేసింది. టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ కరోనా వైరస్ భయంతో చాలా మంది తిరుమల రాలేకపోయారు. దీంతో జూన్ నెలలో రోజుకు ఐదు వేల టికెట్లను మాత్రమే జారీ చేసింది. 
 
జులైలోనూ అదే సంఖ్యలో టికెట్లను జారీ చేస్తోంది. ఫలితంగా నేరుగా తిరుమల వచ్చే భక్తులు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు పొందేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి 79 రోజులుగా సర్వదర్శనం నిలిచిపోవడంతో టికెట్ల కోటాను పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.