తెలుగు ప్రజలకు సేవ చేయాలనివుంది... ఎంపీ నవనీత్ కౌర్
తనకు ఒక నటిగా గుర్తింపునిచ్చింది తెలుగు ప్రజలేనని, అలాంటి తెలుగు ప్రజలకు సేవ చేయాలని వుందని సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ చెప్పుకొచ్చారు. ఆమె శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, కుల ధ్రువీకరణ పత్రం అంశంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని చెప్పారు. అందుకే తాను ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్నట్టు చెప్పారు.
తాను తెలుగు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. రైతులు, మహిళలు, యువతకు సాయం చేస్తానని అన్నారు. దేశంలో కొవిడ్ విజృంభణ తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని శ్రీవారిని మొక్కుకున్నట్లు తెలిపారు.
మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నవనీత్ కౌర్... గత లోక్‌సభ ఎన్నికల సమయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారన్న ఆరోపణలపై ఇటీవల విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. ఆమె ఎస్సీ కాదని తీర్పునిచ్చింది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా, ఆమెకు ఊరటనిచ్చేలా తీర్పు వచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.