మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (10:56 IST)

యూఎస్ ఓపెన్ సెమీస్.. సెరీనా విలియమ్స్‌కు అజరెంకా షాక్

Serena williams
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫెవరేట్ సెరీనా విలియమ్స్‌కు సెమీఫైనల్లో షాకిచ్చింది. విక్టోరియా అజరెంకా అద్భుతం సృష్టించింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో అజరెంకా 1-6, 6-3, 6-3 స్కోర్‌తో సెరీనాపై గెలుపును నమోదు చేసింది. గతంలో రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన అజరెంకా.. ఏడేళ్ల తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించింది. 
 
వాస్తవానికి యూఎస్ ఓపెన్‌లోనూ రెండుసార్లు ఫైనల్స్‌లో సెరీనా చేతిలోనే అజరెంకా ఓడింది. ఓ దశలో రిటైర్మెంట్ ఇద్దామనుకున్న విక్టోరియా మళ్లీ తన పాత ఫామ్‌ను ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో యూఎస్ ఓపెన్ సెమీస్ తెగ టెన్షన్ పుట్టించింది. తొలి సెట్‌ను 6-1 తేడాతో సెరీనా సునాయాసంగా తన ఖాతాలో వేసుకుంది. కానీ రెండవ సెట్‌లో మాత్రం అజరెంకా తన సత్తా చాటింది. బ్రేక్ పాయింట్లు సాధిస్తూ సెరీనాకు చుక్కలు చూపెట్టింది.  
 
ఇక నిర్ణయాత్మక మూడవ సెట్ ఆరంభంలో అజరెండా దూకుడు ప్రదర్శించింది. ఓ దశలో ఇద్దరూ సమానం అయ్యారు. అయితే సెరీనాకు మడిమ పట్టేయడంతో ఆమె టైమౌట్ తీసుకుంది. కానీ అజరెంకా మాత్రం సెరీనాకు కోలుకునే ఛాన్సు ఇవ్వలేదు. 
 
సెరీనా 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఆశలపై అజరెంకా నీళ్లు చల్లింది. అంతకముందు జరిగిన తొలి సెమీఫైనల్లో నవోమి ఓసాకా 7-6 (7-1) 3-6 6-3 స్కోర్‌తో జెన్నిపర్ బ్రాడీపై గెలుపొందింది. శనివారం జరిగే ఫైనల్లో ఓసాకాతో అజరెంకా తలపడుతుంది.