ఇండోనేషియా ఓపెన్.. ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సైనా నెహ్వాల్!
ఇండోనేషియా ఓపెన్‌లో ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి భారత స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో మూడుసార్లు టోర్నీ ఛాంపియన్, ఎనిమిదో సీడ్ సైనా 21-11, 19-21, 21-15తో పే యూ పొ (చైనీస్ తైపీ)పై చెమటోడ్చి గెలుపును నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ గంటా 3 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగింది. ఆద్యంతం మెరుగ్గా రాణించిన సైనా నెహ్వాల్ గెలుపును నమోదు చేసుకుంది.
ఇక ప్రీ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ ఫిత్రియాని (ఇండోనేసియా)తో సైనా తలపడనుంది. ఇకపోతే.. మిక్స్‌డ్ తొలి రౌండ్లో మను అత్రి- అశ్విని పొన్నప్ప జోడీ 14-21, 25-27తో వరుస గేముల్లో యోంగ్ కై టెర్రీ హీ-వే హన్ టన్ (సింగపూర్) ద్వయం చేతిలో ఓడిపోయింది.