బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (09:25 IST)

నీకో నమస్కారం.. నీ సలహాకో నమస్కారం... రాహుల్‌కు దండం పెట్టిన నారాయణ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సోమవారం రాహుల్ గాంధీ వచ్చారు. ఆయనతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కె.నారాయణ ఇంకా ప్రజా కూటమి నేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం ఒకటి జరిగింది. రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న నారాయణను రాహుల్ సరదాగా ఆటపట్టించారు. 
 
సోమవారం కూకట్ పల్లిలో ప్రజాకూటమి సభ జరిగింది. ఇందులో రాహుల్, చంద్రబాబు, నారాయణ, ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు. అపుడు కంకి కొడవలి గుర్తు వున్న పార్టీ కండువా కప్పుని నారాయణ వచ్చి రాహుల్ పక్కన కూర్చొన్నారు. నారాయణ మెడలోని కండువా చూసిన రాహుల్... 'కాలం మారింది.. అందరూ సెల్‌ఫోన్లు వాడుతున్నారు. సెల్‌ఫోన్‌ను మీ పార్టీ గుర్తుగా పెట్టుకోండి యువత ఆకర్షితులవుతారు. పార్టీ ప్రాభవం మరింత పెరుగుతుంది' అంటూ నవ్వుతూ సలహా ఇచ్చారు. 
 
దీనిపై నారాయణ వెంటనే రెండు చేతులు జోడించి.. 'అయ్యా.. నీకో నమస్కారం.. నీ సలహాకో నమస్కారం. అలాంటి ప్రతిపాదనలు చేస్తే పార్టీ నుంచి బహిష్కృతుడిని కావడం ఖాయం' అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబుతో సహా రాహుల్‌కూడా పగలబడి నవ్వారు. రాహుల్ కలుపుగోలుతనాన్ని నారాయణ ఎంతగానో మెచ్చుకున్నారు.