మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (10:05 IST)

ఊపిరి పీల్చుకున్న గులాబీ నేతలు- లగడపాటి సర్వే జోస్యం అక్కడ నిజమైంది..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ముందంజలో దూసుకుపోతున్న నేపథ్యంలో.. అప్పుడే తెరాస కార్యకర్తలు సంబరాలు మొదలెట్టారు. ఇప్పటివరకు మూడు రౌండ్ల ఫలితాలు విడుదల కాగా.. ఈ ఫలితాల్లో కారు ఆధిక్యంలో దూసుకుపోతోంది. ప్రత్యర్థులకు ఏమాత్రం అందని దూరంలో టీఆర్ఎస్ ముందుకెళ్తోంది. దీంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. 
 
తమ పార్టీ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ.. సంబరాలు మొదలు పెట్టేశారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్ వద్ద అప్పుడే పండగ వాతావరణం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7వ తేదీన జరిగిన పోలింగ్‌ ఫలితాలు మంగళవారం వెలువడనున్న సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో భాగంగా పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు. మక్తల్‌లో స్వతంత్ర అభ్యర్థి జలంధర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ నుంచి చిట్టం రామ్మోహన్‌రెడ్డి బరిలో ఉండగా.. కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి కె. దయాకర్ రెడ్డి ఉన్నారు.
 
ఈ నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థి గెలుస్తారని లగడపాటి సర్వే జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా రామగుండంలోనూ స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇక ఇబ్రహీంపట్నంలో మల్ రెడ్డి రంగారెడ్డి ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.