తెలంగాణ ఎన్నికల న్యూస్ : కొద్దిసేపట్లో ఉత్కంఠతకు తెర
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో వెల్లడికానున్నాయి. దీంతో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడనుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ ఏదో తేలిపోనుంది.
ఈ నెల 7వ తేదీన పోలింగ్ జరుగగా, మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సుమారు 2.06 కోట్ల మంది ఓటర్లు ఇచ్చిన తీర్పు వెల్లడవనుంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగనుందా? టీఆర్‌ఎస్ సర్కారే కొనసాగనుందా? అన్నది స్పష్టమవనుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2,80,74,722 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 73.2 శాతం అంటే దాదాపు 2.05 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇకపోతే, ఎన్నికల విధుల్లో పాల్గొన్న సుమారు 1.60 లక్షల మందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది వరకు సర్వీస్ ఓటర్లున్నారు. దీంతో కనీసం లక్షకు పైగా పోస్టల్ బ్యాలెట్/సర్వీస్ ఓట్లు జత కానున్నాయి. తద్వారా ఓట్ల సంఖ్య 2.06 కోట్లు దాటనుంది. మొత్తం 1821 మంది పోటీ పడగా.. 119 మంది విజేతలుగా నిలవనున్నారు. మిగతా వారిలో ఎంత మందికి డిపాజిట్‌లు దక్కుతాయి? ఎంత మందికి దక్కవు? అన్నది కూడా మంగళవారానికి తేలిపోనుంది.
ఇదిలావుంటే, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టభద్రతను కల్పించారు. ఓట్ల లెక్కింపు జరగనున్న 31 కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలతోపాటు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద సీనియర్ ఐపీఎస్ అధికారి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.