గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 5 జులై 2024 (08:47 IST)

ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ పార్టీ - రాత్రికి రాత్రి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు!!

brs mlcs
తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఖాళీ అవుతుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లోకి జారుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. రాత్రికి రాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస కండువా కప్పుకున్న వారిలో దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, భాను ప్రసాద్, సారయ్య, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్‌లు ఉన్నారు. వీరంతా గురువారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. సీఎం రేవంత్ నివాసంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్‌చార్జి దీప్‌దాస్ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
కాగా, గత కొన్ని రోజులుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారాస పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియ శ్రీహరిలు హస్తం గూటికి చేరుకున్నారు. కాగా, త్వరలోనే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.