ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 జులై 2024 (18:13 IST)

మాజీ సీఎం కేసీఆర్ షాక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కేకే!!

kk and kharge
తెలంగాణ రాష్ట్రంలోని భారత రాష్ట్ర సమితి (భారాస) అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు తేరుకోలేని షాక్ తగిలింది. నిన్నామొన్నటివరకు కేసీఆర్‌కు కుడి భుజంలా వ్యవహరించిన సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావు అలియాస్ కేకే తిరిగి మాతృ సంస్థకే చేరుకున్నారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీప్‌దాస్ మున్షీలు తదితర సీనియర్ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా వారంతా కేకేను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 
 
గత తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్న భారాస ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారానికి దూరమైంది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ కూడా చిత్తుగా ఓటమిపాలైంది. మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను ఒక్క స్థానంలో కూడా గెలుచుకోలేక పోయింది. దీంతో ఆ పార్టీకి చెందిన నేతలంతా ఒక్కొక్కరుగా జారుకుంటారు. ముఖ్యంగా, గత ఎన్నికల్లో గెలిచిన పలువురు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. దీంతో ఏం చేయాలో తోచని బీఆర్ఎస్ అధిష్టానం... పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది.