గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 15 మార్చి 2020 (10:17 IST)

కర్ణాటక కరోనా మృతునికి 34 మంది సేవలు

తమ రాష్ట్ర వ్యక్తి హైదరాబాద్ లో మరణానికి కారణం కరోనానే అని కర్ణాటక మంత్రి శ్రీరాములు ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అతనితో సన్నిహితంగా ఉన్న వారందర్నీ వైద్య అధికారులు గుర్తించారు.

కరోనా లక్షణాలతో చికిత్స కోసం హైదరాబాద్‌కు వచ్చి తిరిగి వెళ్తూ దారిలో మృతి చెందిన కర్ణాటకవాసి ఇక్కడ ఎవరెవర్ని కలిశాడు? హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ చికిత్స పొందాడనే సమగ్ర సమాచారాన్ని వైద్య, ఆరోగ్యశాఖ సేకరించింది. బాధితుడి కుటుంబ సభ్యులు కర్ణాటక నుంచి మొదట హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు.

అక్కడ చికిత్స కొనసాగుతుండగానే.. పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చి ఆరా తీశారు. ఇప్పుడు వీరున్న ఆసుపత్రి నుంచే సిబ్బంది ద్వారా నమూనాలు సేకరించి పంపితే పరీక్షిస్తామని గాంధీ వైద్యులు తెలిపారు. కానీ వారు మళ్లీ రాలేదు. నమూనాలను కానీ, రోగిని కానీ తీసుకురాలేదు. మొదట చేర్చిన ప్రైవేటు ఆసుపత్రి నుంచి మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ సుమారు 4 గంటల పాటు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. రోగి అనారోగ్య తీవ్రతను, ప్రయాణ సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని గాంధీకే వెళ్లాల్సిందిగా సూచించారు. కానీ వారు పట్టించుకోకుండా కర్ణాటకకు తిరిగి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నారు. అంతలో మార్గమధ్యలోనే అతడు మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఈ మొత్తం వ్యవహారంలో మృతునికి రెండు ఆసుపత్రుల్లోనూ పరీక్షలు, చికిత్స సమయంలో సుమారు 34 మంది వైద్యసిబ్బంది పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో కొందరు వైద్యులు, నర్సులు, సహాయక సిబ్బంది, అంబులెన్సు డ్రైవర్లు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ గుర్తించింది.

వారందరి ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ఎవరిలోనూ వైరస్‌ లక్షణాలు లేవని వైద్యవర్గాలు తెలిపాయి. వారందరిని ఇళ్లలోనే విడిగా ఉండాలని ఆదేశించింది.