ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (13:03 IST)

17పార్లమెంట్ నియోజకవర్గాల్లో 16 చోట్ల గెలవడమే లక్ష్యం.. కేటీఆర్

తెలంగాణ ఎన్నికల్లో గెలుపును సాధించిన అనంతరం తెలుగుదేశం పార్టీపై టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 16 చోట్ల గెలవడమే తన లక్ష్యమన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నిక్లలో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటేందుకు సిద్ధంగా వుందని కేటీఆర్ సవాల్ విసిరారు.


దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ నెం.2గా కీలక పాత్ర పోషిస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఉండదని.. కేంద్రంలోనూ ఇక అదే జరుగుతుందని చెప్పుకొచ్చారు. 
 
తెలంగాణలో 17 లోక్‌సభ సీట్లుండగా, హైదరాబాద్ స్థానం మజ్లిస్ ఆధీనంలో దీర్ఘకాలంగా వుందన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో ముస్లింల ఓట్లు అత్యధికంగా వుండటంతో ఎంఐఎం అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే అయిన నేపథ్యంలో కేటీఆర్ 16 సీట్లు గెలుస్తామని చెప్పడం చర్చనీయాంశమైంది. తెలంగాణ ఎన్నికల తరువాత ఈవీఎంలపై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను కేటీఆర్ ఖండించారు. 
 
కాంగ్రెస్ నేతలకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ గఢ్, రాజస్థాన్‌ లోని ఈవీఎంలపై ఎందుకు అనుమానం రావట్లేదని ప్రశ్నించారు. దేశంలో సాధారణ వ్యక్తి అభివృద్ధి కోరుకుంటున్నాడని, దేశ ప్రజలకు ఆరోగ్యం, విద్య, విద్యుత్, మౌలిక వసతులు కల్పించేలా చూడాలని ఆశిస్తున్నాడని కేటీఆర్ చెప్పారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నీటిపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. 
 
దేశంలో జీవ నదులు వున్నా... ఆ నీటిని ప్రజలు సక్రమంగా వినియోగించుకునేలా చేయడంలో ప్రభుత్వాలు విఫలమైనట్లు కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సర్కారు రైతులకు పెద్దపీట వేస్తుందని చెప్పారు.