శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: మంగళవారం, 11 మే 2021 (13:13 IST)

చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి బాసటగా నిలిచిన బ్యాచ్‌మేట్స్

నల్లగొండ: వారంతా 2009 బ్యాచ్ కానిస్టేబుల్స్... తమ తోటి కానిస్టేబుల్ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబానికి బాసటగా నిలిచి పెద్ద మనసుతో ఆర్థికసాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా 2009 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్స్.
 
ఉమ్మడి నల్లగొండ జిల్లా 2009 బ్యాచ్ కు చెందిన రాజశేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు తోటి బ్యాచ్ మేట్స్. అనుకున్నదే తడవుగా బ్యాచ్ మేట్స్ అందరి సహకారంతో 2,57,500 రూపాయల నగదును కె. కమల్ హాసన్, జానిమియా కానిస్టేబుల్స్ సోమవారం రాజశేఖర్ భార్య భవాని, కుమారులు వర్షిత్ గౌడ్, తేజ్ గౌడ్ లకు అందించి తమ  మానవత్వాన్ని చాటుకున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2009 బ్యాచ్ కు చెందిన సుమారుగా 200 మంది తమకు తోచిన విధంగా అందించిన ఈ నగదును రాజశేఖర్ కుటుంబానికి అందించారు. రాజశేఖర్ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని, ఎలాంటి సహాయం అయినా చేస్తామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.
 
కాగా 2009 బ్యాచ్ కానిస్టేబుల్స్ తమ తోటి బ్యాచ్ కుటుంబానికి అండగా నిలవడం పట్ల రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, డిఐజి ఏ.వి. రంగనాధ్, సూర్యాపేట ఎస్పీ భాస్కరన్, యాదాద్రి డిసిపి నారాయణ రెడ్డి, ఎస్పీ సతీష్ చోడగిరి, నల్లగొండ అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, బి. జయరాజ్, సోమయ్యలు అభినందించారు.