1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 6 జులై 2015 (14:32 IST)

కేంద్రం జోక్యంతోనే ఇద్దరు చంద్రులు రాజీకొచ్చారు : భట్టి విక్రమార్క

ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావులు కేంద్రం జోక్యంతోనే ఒక్కటయ్యారని టీ పీసీసీ వర్కింగ్ కమిటీ ఛైర్మన్ భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాల్లో ఇటు కేసీఆర్‌, అటు చంద్రబాబు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుని... కేంద్రం జోక్యంతో రాజీకొచ్చారని, ఆ ఇద్దరూ చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని సెటిల్‌మెంట్‌ ధోరణిని అవలంబిస్తున్నారని మండిపడ్డారు. 
 
ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా రూ.50 లక్షలతో పట్టుబడిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని, పట్టపగలు జరిగిన ఈవ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టులాంటిదన్నారు. దీంతో రాష్ట్ర ప్రజలు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అటు టీఆర్‌ఎస్‌, ఇటు టీడీపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
 
ఇకపోతే.. కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, పరిస్థితి రాజ్యాంగ సంక్షోభానికి దారితీయబోతోందని.. అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.