గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: సోమవారం, 12 ఏప్రియల్ 2021 (19:35 IST)

ప్లవ నామ ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు

ప్లవ నామ ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈ సంవత్సర ప్రాధాన్యతగా పంచాంగాలు చెప్తున్న నేపథ్యంలో.. తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి ప్రకృతి కూడా తోడు కావడం శుభసూచకమన్నారు. వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ఉగాది ప్రసిద్ధిగాంచిందన్నారు.
 
ఆకులు రాల్చిన ప్రకృతి కొత్త చిగురులతో వసంతాన్ని మోసుకొస్తూ, నూతనోత్తేజాన్ని సంతరించుకుంటూ ఆహ్లాదకరమైన కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుతుందని తెలిపారు. వ్యవసాయానికి ముందస్తు ఏర్పాట్లను ఉగాది నుంచే రైతు ప్రారంభిస్తారని, రైతును సాగుకు సంసిద్ధం చేసే ఈ పండుగ వారి జీవితంలో భాగమై పోయిందన్నారు. యేటా చైత్రమాసంతో వచ్చే పండుగ నాడు పచ్చడిని సేవించడం గొప్ప ఆచారమని సీఎం అన్నారు. అప్పుడప్పుడే చిగురించే వేపపూతను, మామిడి కాతను, చేతికందే చింతపండులాంటి ప్రకృతి ఫలాలతో తీపి, వగరు, చేదు రుచుల పచ్చడి సేవించడం గొప్ప సందేశాన్నిస్తున్నదని పేర్కొన్నారు.
 
మనిషి జీవితంలోని కష్టసుఖాలు, మంచిచెడుల జీవిత సారాన్ని తాత్వికంగా గుర్తుచేసుకునే గొప్ప సజీవ సంప్రదాయానికి చిహ్నంగా ఉగాది పచ్చడి సేవిస్తారని తెలిపారు. ఉమ్మడి పాలనలోని చేదు అనుభవాలను చవిచూసిన తెలంగాణ రైతు, స్వయంపాలనలో తియ్యటి ఫలాలను అనుభవిస్తున్నారని అన్నారు.
 
ప్రాజెక్టులతో బీళ్లను తడిపాం..
బ్యారేజీలు కట్టి, సొరంగాలు తవ్వి, లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి.. నదీజలాలను సాగరమట్టానికి ఎత్తుమీద వున్న బీళ్లకు మళ్లించామని సీఎం గుర్తుచేశారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిని చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అనేక ప్రశంసలను అందుకుంటున్నదన్నారు. మండే వేసవిలోనూ చెరువులను నిండుకుండలుగా మార్చి, రైతులకు పసిడి పంటలను అందిస్తున్నదన్నారు.
పాలమూరు ఎత్తిపోతలు, ఆన్ గోయింగ్ సాగునీటి ప్రాజెక్టులను మరి కొద్దినెలల్లో పూర్తి చేసుకోబోతున్నామని వెల్లడించారు.
 
రైతు పండించిన పంటను ప్రభుత్వమే స్వయంగా కొనుగోలు చేసి రైతును కరోనా కష్ట కాలంలో ఆదుకుంటున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా నిలిచిందన్నారు. విమర్శకుల అంచనాలను తారుమారు చేసి పంటల సాగు, ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానానికి చేరుకున్నదన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అందిస్తున్న భరోసాతో తెలంగాణ రైతు కుటుంబాల జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయన్నారు.
 
రైతులకు అన్నివిధాలా అండగా నిలిచాం.. విత్తనం నాటిన నుంచి.. పంట ఫలం చేతికొచ్చేదాకా రైతులకు అన్నిరకాల సాయం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వారి కష్టాలను తన భుజాల మీదికి ఎత్తుకున్నదన్నారు. రైతును సంఘటిత పరిచేందుకు రైతుబంధు సమితులు ఏర్పాటు చేసి, ఊరూరా రైతుల కోసం వేదికలను నిర్మించామన్నారు.
 
గత ఉమ్మడి రాష్ట్ర పాలనలో దండుగన్న వ్యవసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పండుగగా మార్చిందన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలక ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు తదితర రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాం.
 
ఇందుకోసం ప్రతి ఏటా సుమారు రూ. 50 వేల కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని గుర్తుచేశారు. రైతు కుటుంబాల జీవితాలలో వసంతాలను తెచ్చి, పున్నమి వెన్నెలలను నింపడమే తమ లక్ష్యం అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.