శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (16:28 IST)

రూ.720 కోసం పండ్ల వ్యాపారిని చంపేసిన యువకులు..ఎక్కడ?

సమాజంలోని మనుషుల్లో నేరప్రవృత్తి పెరిగిపోతోంది. క్షణికావేశంలో చిన్నచిన్న విషయాలకే దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ నగరంలో ఓ దారుణం జరిగింది. కేవలం 720 రూపాయల కోసం ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఈ ఘాతుకానికి పాల్పడింది కూడా ముగ్గురు యువకులు కావడం గమనార్హం. 
 
హయత్ నగర్‌లోని డిపో సమీపంలో సుభాష్ అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈయన వద్ద నర్సింహా, ఆనంద్, మధుసూధన్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు సహాయకులుగా పనిచేస్తున్నారు. 
 
ఈ క్రమంలో సందీప్ రెడ్డి, ఉదయ్ కిరణ్ రెడ్డి, శ్రీకాంత్‌ అనే ముగ్గురు యువకులు పండ్ల షాపు పక్కనే ఉన్న మద్యంషాపునకు వచ్చారు. అయితే, ఓ బెల్ట్ షాప్ వద్ద ఈ ముగ్గురు యువకులు… గూగుల్ పే పని చేయడంలేదంటూ సుభాష్‌ వద్ద 720 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. 
 
ఈ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో సందీప్‌ రెడ్డికి చెందిన బైక్‌, సెల్ ఫోన్‌ను సుభాష్‌ తీసుకెళ్లాడు. వాటిని తన వద్ద పనిచేసే ఆనంద్, మధుసూధన్‌ రెడ్డి, నర్సింహలకు అప్పగించి సుభాష్‌ ఇంటికి వెళ్లాడు. ఆ వ్యక్తులు వస్తే డబ్బులు తీసుకుని.. వాటిని ఇచ్చేయమని సూచించాడు. 
 
కొద్దిసేపటికి నిందితులు పండ్ల బండి వద్దకు వచ్చి వారితో గొడవకుదిగారు. కర్రలతో దాడిచేయబోతే మధుసూదన్‌ రెడ్డి, నర్సింహ, ఆనంద్ అక్కడ్నుంచి ప్రాణభయంతో‌ పరుగులు తీశారు. అయితే, మధుసూదన్‌ రెడ్డి వారికి చిక్కడంతో కర్రలు, రాయితో అతడిపై దాడి చేశారు. 
 
దీంతో మధుసూదన్‌ రెడ్డి స్పాట్‌లోనే మృతి చెందాడు. నర్సింహ కంప్లైంట్ మేరకు హయత్‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితులు ముగ్గురు ఉన్నత చదువులు చదివినవారే అవ్వడం గమనార్హం. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు... ఆ ముగ్గురుని అరెస్టు చేశారు.