శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 అక్టోబరు 2020 (12:13 IST)

హైదరాబాద్ నగరంలో చిరుత చక్కర్లు... బోనులో బంధించిన అధికారులు

హైదరాబాద్ నగర వాసులను ఓ చిరుత పులి భయపెట్టింది. నగర వ్యాప్తంగా చక్కర్లుకొట్టిన ఈ చిరుత స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. 
 
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర‌న‌గ‌ర్ వాలంత‌రి రైస్ రిసెర్చ్ సెంట‌ర్ స‌మీపంలోనూ చిరుత రెండు లేగ దూడ‌ల‌ను చంపడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయంపై స్థానికులు పోలీసులు, అట‌వీశాఖ సిబ్బందికి స‌మాచారం అందించడంతో ఆ చిరుత కోసం వెతికారు.
 
చిరుత తిరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, చనిపోయిన దూడలను ఎరగా అక్కడ ఉంచారు. దీంతో గత అర్థరాత్రి ఆ చిరుత పశువుల పాక వద్దకు వచ్చి అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. 
 
ఎట్టకేలకు చిరుత చిక్కడంతో తమకు ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. చిరుతను పట్టుకున్న అనంతరం అటవీశాఖ అధికారులు దాన్ని జూపార్కుకు తరలించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.