సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (12:48 IST)

కేసీఆర్‌కు పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు.. దీర్ఘాయుష్షును..?

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాను అభిమానించే సమకాలీక రాజకీయవేత్తల్లో కేసీఆర్‌ ఒకరని పేర్కొన్నారు. దార్శనికత, దృఢ సంకల్పం ఆయనలో పుష్కలంగా ఉన్నాయన్నారు.

కేసీఆర్‌ చిరంతనంగా ప్రజలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ఆయనకు ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
 
తెలంగాణ ఉద్యమం నుంచి ఆయన రాజకీయ శైలిని నిశితంగా అర్థం చేసుకుంటున్నానని, ప్రజలకు చేరువకావడానికి ఆయన అమలుపరిచే విధానాలు, వాటి సరళి ఎంతో ప్రభావితంగా ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆయన ప్రజలందరినీ సమైక్యంగా ఉంచేందుకు చేసిన కృషి నన్ను ఎంతగానో కట్టుకుందని చెప్పారు. 
 
వివిధ ప్రాంతాల వారందరినీ అక్కున చేర్చుకోవడం ఆయన పరిపాలనా దక్షతకు ప్రతీకని కొనియాడారు. వేర్వేరు రాజకీయ పంథాలు అనుసరించేవారు కూడా కేసీఆర్‌ను ఇష్టపడడం.. ఆయనలోని రాజకీయ ప్రజ్ఞ, పాటవాలకు నిదర్శనమన్నారు.