బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (17:53 IST)

నాడు రుద్రమదేవి.. నేడు షర్మిల : కంచె ఐలయ్య వ్యాఖ్యలు

వైఎస్. షర్మిలపై ప్రముఖ రచయిత కంచె ఐలయ్య ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్న డిమాండ్‌తో ధర్నాచౌక్‌లో వైఎస్ షర్మిల దీక్షకు చేపట్టడం హర్షణీయమన్నారు. ఈ దీక్షకు తాను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా, కాకతీయ గడ్డ మీద రుద్రమదేవి తర్వాత మళ్లీ షర్మిలను చూస్తున్నానంటూ ఉద్వేగానికి గురయ్యారు. 
 
తెలంగాణ గడ్డపై రాజకీయ పార్టీ పెట్టే హక్కు షర్మిలకు ఉందన్నారు. సమ్మక్క - సారక్క వారసురాలు షర్మిల అని, తెలంగాణ మహిళలు షర్మిలను ముఖ్యమంత్రి చేస్తారని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ పాలనను గుర్తు చేసుకున్నారు. ఆయన హయాంలో ఆరు వేల ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ప్రారంభించారని, పేదల చదువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
 
మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చందమామ లాంటి పిల్లలు చనిపోతుంటే కేసీఆర్‌కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఉన్నది గుండెనా.. బండరాయా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
యువతకు న్యాయం జరగాలని, నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు తమ దీక్షలు కొనసాగుతాయన్నారు. గురువారం తాను ప్రారంభించిన దీక్ష.. 72 గంటల పాటు కొనసాగుతుందని సంచలన ప్రకటన చేశారు. 
 
ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్క్ దగ్గర ప్రారంభించిన దీక్షకు పోలీసులు ఒక రోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే షర్మిల తాజా ప్రకటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై పోలీసుల నుంచి ప్రకటన రావలసి ఉంది.