కత్తితో వ్యక్తి హల్ చల్.. వృద్ధురాలితో పాటు మనవడిపై దాడి
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. బండ్లగూడ మల్లికార్జుననగర్‌లో అర్థరాత్రి వినోద్ అనే వ్యక్తి కత్తితో హల్‌చల్ చేశాడు. ఓ ఇంటిపై దాడి చేసిన వినోద్.. వృద్ధురాలితో పాటు మనుమడు జాన్ మెడిపై కత్తితో దాడి చేశాడు.
ఇద్దరూ పెద్దగా కేకలు వేయడంతో ఆ ఇంటికి స్థానికులు చేరుకున్నారు.. దీంతో.. దాడి చేసిన వినోద్ పారిపోయే ప్రయత్నం చేయగా. అతడిని వెంటాడి పట్టుకున్నారు కాలనీ వాసులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు.. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలి, ఆమె మనవడిని ఆసుపత్రికి తరలించారు.. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కత్తితో దాడి చేసిన వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు.. కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
అయితే, దుబాయ్‌లో ఉంటున్న వృద్ధురాలి కూతురు డబ్బులు అప్పు తీసుకుని.. తిరిగి చెల్లించకపోవడమే దాడికి కారణంగా తెలుస్తోంది. డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న కోపంతోనే వారిపై దాడి చేసినట్టు నిందితుడు.. పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. ఇక, కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.