బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 జులై 2021 (10:59 IST)

లాకప్‌లో మరియమ్మ మృతి : ముగ్గురు పోలీసులపై వేటు

దొంగతనం కేసులో అరెస్టు చేసిన ఓ మహిళ ఠాణా లాకప్‌లో చనిపోయింది. ఈ ఘటనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ లాక్‌డెత్ కేసులో ముగ్గురు పోలీసులపై వేటు వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడేనికి చెందిన మరియమ్మను గతనెల 18న యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీసులు రూ.2 లక్షల దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్నారు. 
 
అంతకుముందు రోజు ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్, అతడి స్నేహితుడు వేముల శంకర్‌ను విచారించి రూ.1.35 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా సొమ్ము కోసం మరియమ్మను పోలీస్ స్టేషన్‌లో విచారించారు. 
 
ఈ సందర్భంగా ఆమె స్పృహ కోల్పోవడంతో తొలుత స్థానిక ఆర్ఎంపీకి చూపించారు. అనంతరం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
పోలీసులు ఆమెను దారుణంగా కొట్టడం వల్లే మరియమ్మ మరణించిందని బాధిత కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నేతలు, దళిత, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
 
దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, పోలీసులు ఆమెను దారుణంగా కొట్టడం వల్లే స్పృహతప్పి పడిపోయిందని, వైద్య సదుపాయం అందించడంలో నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని తేలింది. 
 
మల్కాజిగిరి ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావు, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అందించిన విచారణ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం.. ఎస్సై వి.మహేశ్వర్, కానిస్టేబుళ్లు ఎంఏ రషీద్, పి.జానయ్యలను విధులు నుంచి తొలగించారు.