శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (19:24 IST)

తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన ఎన్జీటీ.. రూ.900 కోట్ల జరిమానా

telangana govt
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దిమ్మతిరిగేలా షాకిచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పర్యావరణ పరిక్షణ అనుమతులు పొందలేదని పేర్కొంటూ రూ.900 కోట్ల మేరకు అపరాధం విధించింది. ముఖ్యంగా, డిండి, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతు లేకుండానే నిర్మిస్తున్నారంటూ ఎన్జీటీ మండిపడింది.
 
పైగా, ఈ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేయాలంటూ గతంలో తామిచ్చిన ఆదేశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం నిర్మాణ వ్యయంతో 1.5 శాతం అంటే రూ.900 కోట్ల మేరకు అపరాధం విధిస్తున్నట్టు ఎన్జీటీ చెన్నై బెంచ్ తీర్పును వెలువరించింది. 
 
ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేపట్టారంటూ కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ.. తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించింది. గతంలో పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తున్నామని ఎన్జీటీ బెంచ్ ప్రస్తావించింది.