తెలంగాణాలో కరోనా కేసుల తగ్గుముఖం... రాత్రిపూట కర్ఫ్యూ పొడగింపు
దేశంలో కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అయితే, గత రెండు రోజులుగా రోజువారీ కేసుల సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో 65,375 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,559 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 984 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో రెండంకెల్లోనే కొత్త కేసులు రావడం తాజా బులెటిన్ లో చూడొచ్చు.
అదే సమయంలో 8,061 మంది కరోనా నుంచి కోలుకోగా 41 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,87,199కి పెరిగింది. 4,13,225 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 71,308 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య2,666కి చేరిది.
మరోవైపు, రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఈ నెల 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. మొదట్లో 8వ తేదీ వరకు కర్ఫ్యూని పొడిగించిన ప్రభుత్వం తాజాగా మరోవారం పాటు పొడిగిస్తూ ఆదేశాలు వెలువరించింది.
వివాహాలకు 100 మంది మించి హాజరుకారాదంది. అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనరాదని తెలిపింది. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, మత, సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రజలు భౌతికదూరం పాటించడం, మాస్కులు తప్పనిసరి అని పేర్కొంది.