సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 ఆగస్టు 2022 (16:42 IST)

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పని చేసే దేవేందర్ (19) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా వేల్పూరులో మంత్రికి క్యాంపు కార్యాలయం ఉంది. ఇక్కడ దేవేందర్ ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నారు. ఈ కార్యాలయంలోని ఓ గదిలో దేవందర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
దేవందర్ ఉరేసుకున్న విషయాన్ని స్థానికులు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. శవాన్ని స్వాధీనం చేసుకుని పంచనామాకు పంపించారు. 
 
కాగా, దేవేందర్‌ స్థానికంగా ఉండే ఓ మహిళతో సన్నిహితంగా ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. పైగా, ఆత్మహత్య చేసుకునేందుకు ముందు ఆ మహిళకు దేవేందర్ ఓ ఎస్ఎంఎస్ కూడా పంపినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ మహిళతో ఉన్న సన్నిహిత సంబంధంతో పాటు వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్యకు పాల్పడివుంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.