బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (13:11 IST)

HYD ఆటోలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్: రిజిస్ట్రేషన్ లేకపోతే..?

హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలను కట్టడి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నిబంధ‌న‌లుకు విరుద్దంగా, రిజిస్ట్రేషన్ లేని ఆటోల‌ను సీజ్ చేయ‌నున్నారు. భాగ్యనగర​ పరిధిలో రిజిస్ట్రేషన్‌ జరిగిన ఆటోలకు మాత్రమే నగరంలో తిరిగేందుకు అనుమతి ఇచ్చారు. 
 
రవాణా, పోలీసు శాఖలు చూసీ చూడనట్టు వదిలేయటంతో తెలంగాణ, ఏపీల నుంచి కొనుగోలు చేసిన ఆటోలను ఆటో వాలాలూ  యథేచ్ఛగా నగరంలో నడుపుతున్నారు. దీంతో పరోక్షంగా ట్రాఫిక్‌ రద్దీ, కాలుష్య తీవ్రతకు కారణంగా నిలుస్తున్నారు. వీటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులు ఆటో డ్రైవర్లు, సంఘాలకు అవగాహన కల్పించారు. 
 
ప్రత్యేక తనిఖీల్లో ఆటోలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్, ఇన్సూరెన్స్, యూనిఫాం తప్పనిసరిగా ఉండాలని ఆటోడ్రైవర్లకు పోలీసులు సూచనలు చేశారు. కాగా హైదరాబాద్ ర‌వాణా శాఖ గ‌ణాంకాల ప్ర‌కారం.. 1.5 ల‌క్షల ఆటోల రిజిస్ట్రేషన్ మాత్ర‌మే ఉన్నాయి. కానీ న‌గ‌రంలో దాదాపు 3 ల‌క్షల‌కు పైగా ఆటోలు తిరుగుతున్నాయి.