గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (14:28 IST)

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ : పొన్నాల లక్ష్మయ్య రాజీనామా

ponnala lakshmiah
మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల పోటీ కోసం జరుగుతున్న అభ్యర్థుల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. పైగా, పార్టీ అంశాలను చర్చించేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వడం లేదని ఆయన వాపోయారు. కొందరు నాయకులు వైఖరితో పార్టీ పరువుపోతోందని చెప్పారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ రాష్ట్రానికి తొలి పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనగామ అసెంబ్లీ సీటును కోరుకున్నారు. కానీ, ఆయనకు కాకుండా కొమ్మారి ప్రతాప్ రెడ్డికి ఈ సీటును కేటాయించారు. ఇది పొన్నాలకు తీవ్ర మనస్తాపం కలిగించింది. 
 
మరోవైపు, గత ఎన్నికల సమయంలో కూడా పొన్నాలకు చివరి నిమిషంలోనే టిక్కెట్‌ను కేటాయించారు. పొత్తులో భాగంగా, కోదండరామ్‌కు జనగామ టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. అయితే, పార్టీ నాయకత్వంతో మాట్లాడి చివరకు ఆయన టిక్కెట్ దక్కించుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.