శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (08:49 IST)

జంట నగర వాసులకు ఆర్టీసీ ఎండీ బంపర్ ఆఫర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆ సంస్థను లాభాల బాటలో పెట్టేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. వివాహాలు వంటి శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకుంటే వారి ఇంటివద్దకే పంపేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే, తాజాగా జంట నగర వాసులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. 
 
టీ-24 (ట్రావెల్‌ 24 అవర్స్‌) పేరిట రూ.100కే ఒకరోజు పాస్‌ జారీ చేయనున్నట్టు ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. ఒక రోజంతా జంటనగరాల పరిధిలో ఏ ప్రాంతానికైనా సిటీ ఆర్డినరీ, సబర్బన్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చని తెలిపారు. పెరిగిన పెట్రోలు ధరలతో సతమతమవుతున్న ప్రజలు అత్యంత చౌకలో, సురక్షితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని వివరించారు. 
 
అదేసమయంలో ఆర్టీసీ బస్సులోకానీ, బస్‌స్టేషన్‌ ప్రాంగణంలోకానీ గుట్కా, ఖైనీ, పాన్‌మసాలా వంటివి వాడకూడదని ఎండీ సజ్జనార్‌ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రీజినల్‌ మేనేజర్లు, డివిజినల్‌ మేనేజర్లు, డిపో మేనేజర్లకు మంగళవారం ఆదేశాలు జారీచేశారు. 
 
కొందరు డ్రైవర్లు, ప్రయాణికులు పాన్‌, గుట్కా, పాన్‌మసాలా వంటివి నమిలి బస్సులో, బయట ఉమ్మడం సరైంది కాదని, ఇది సంస్కారవంతులు చేసే పనికాదని పేర్కొన్నారు. ఎంతో మంది ప్రయాణికులు ప్రయాణం చేసే బస్సులను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఆర్టీసీ సిబ్బందిపై ఉందనే విషయాన్ని ఆర్టీసీ సంస్థలో పని చేసే ప్రతి ఒక్క ఉద్యోగి గుర్తుపెట్టుకోవాలని ఆయన కోరారు.