శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (11:31 IST)

కుమారుల వంతులవారీ పోషణ భరించలేక చితిని పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు

deadbody
తనను కన్నబిడ్డలు వంతుల వారీగా పోషించడాన్ని జీర్ణించుకోలేని ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యకు ముందు ఆయన తన చితిని తానే పేర్చుకుని చితికి నిప్పంటించుకుని, ఆ మంటల్లో దూకి ప్రాణాలు తీసున్నారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90) అనే వ్యక్తికి నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈయన భార్య గతంలోనే చనిపోయింది. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న కుమారులకు తనకున్న నాలుగు ఎకరాల భూమిని సమానంగా పంచిపెట్టారు. ఆ తర్వాత తనకు వచ్చే వృద్ధాప్య పింఛనుతో పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉంటూ వచ్చాడు. అయితే, తండ్రి పోషణ తనదొక్కడిదే కాదని తెగేసి చెప్పాడు. ఆ తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించాడు. 
 
నెలకు ఒకరు చొప్పున పోషించాలని పంచాయతీ పెద్దలు తీర్పునిచ్చారు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు కనకయ్య వద్ద నెల రోజులు గడిచిపోవడంతో నవాబుపేటలో ఉన్న రెండో కుమారుడు వద్దకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీన సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి ఆ రాత్రికి అక్కడే ఉన్నారు. ఆయనతో ఆ రాత్రి తన బాధలు చెప్పుకుని విలపించారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత నవాబ్ పేటలోని కుమారుడు వద్దకు వెళుతున్నట్టు చెప్పి అక్కడ నుంచి బయలుదేరాడు. 
 
అయితే, సాయంత్రమైన తన తండ్రి ఇంటికి చేరుకోలేదు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం గ్రామంలోని ఎల్లమ్మగుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో ఉన్న వెంకటయ్య మృతదేహం కనిపించింది. తాటికమ్మలను ఒక్కచోట కుప్పగా వేసి దానికి నిప్పంటించి ఆ మంటల్లో దూకి వెంకటయ్య ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.