ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెలంగాణ ఎన్నికలు : చంద్రబాబు నిర్ణయంతో టీడీపీ శ్రేణుల నిరుత్సాహం

kasani gnaneswar
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో ఆ రాష్ట్రానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు తన వంతు సహకారం అందించిన సీఎం కేసీఆర్‌‍కు, ఆయన పార్టీ నేతలకు తగిన విధంగా సమాధానం చెప్పేందుకు తెలంగాణ టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. కానీ చంద్రబాబు నిర్ణయంతో వారు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. 
 
కొన్ని నెలల క్రితం ఖమ్మం, హైదరాబాద్ నగరాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలు జరిగాయి. ఇవి సక్సెస్ కావడంతో తెలంగాణ టీడీపీలోనూ కొత్త ఆశలు రేకెత్తాయి. దాంతో, ఈసారి ఎన్నికల్లో బరిలో దిగేందుకు తెలంగాణ టీడీపీ నేతలు సిద్ధమయ్యారు.
 
అయితే, తెలంగాణ ఎన్నికల్లో పోటీ వద్దంటూ టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ టీడీపీ నేతలతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయొద్దంటూ పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన నేతలకు వివరించారు.
 
కానీ, తెలంగాణ టీడీపీ నేతలు ససేమిరా అన్నారు. ఈసారి ఎన్నికల బరిలో దిగాల్సిందేనని స్పష్టం చేశారు. దాంతో కాసాని జ్ఞానేశ్వర్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. అటు పార్టీ హైకమాండ్ ఆదేశాలను దాటి వెళ్లలేక, ఇటు పార్టీ నేతలను బుజ్జగించలేక భావోద్వేగాలకు లోనయ్యారు. ఎన్నికల్లో పోటీపై మరోసారి పార్టీ హైకమాండ్‌తో చర్చిస్తానని తెలంగాణ టీడీపీ నేతలకు సర్దిచెప్పారు. కాగా, నవంబరు 30వ తేదీన తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.