సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 మే 2021 (09:02 IST)

కరోనా మాటున బాల్య వివాహాలు.. తెలంగాణాలోనే అధికం

దేశాన్ని కరోనా వైరస్ కమ్మేసింది. ఈ వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, ఆర్థికంగా తీవ్ర కష్టాలు పడుతున్నారు. అదేసమయంలో అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు చేస్తున్నారు. 
 
నిజానికి బాల్య వివాహాలను తగ్గించేందుకు తెలుగు రాష్ట్రాలు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కల్యాణి లక్ష్మి, షాదీముబారక్‌ వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసింది. దీంతో తెలంగాణలో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గినప్పటికీ, కరోనా కష్టకాలంలో వీటి సంఖ్య గతం కంటే పెరిగింది. దీంతో బాల్య వివాహాలను నిలువరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తున్నది. 
 
2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి వరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ద్వారా 1,355 బాల్య వివాహాలను అడ్డుకోవడం విశేషం. అంతకు ముందు ఏడాది వీటి సంఖ్య 977. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా వికారాబాద్‌ జిల్లాలో 176 బాల్య వివాహాలను ప్రభుత్వ యంత్రాంగం నివారించింది. 
 
ఆ తర్వాత వనపర్తి, సంగారెడ్డి జిల్లాల్లో 83 చొప్పన, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 72 బాల్యవివాహాలను చైల్డ్‌ ప్రొటెక్షన్‌ విభాగం అడ్డుకొని తల్లిదండ్రులకు, పిల్లలకు కౌన్సెలింగ్‌ నిర్వహించింది. పోషణభారం లేని తల్లిదండ్రుల పిల్లలు ఆయా జిల్లాల్లోని స్త్రీ, శిశు సంక్షేమశాఖ హోమ్స్‌లో (యువతులు మాత్రమే) ఉండేలా ఏర్పాటుచేసింది. ఇక్కడ వారికి టైలరింగ్‌, బ్యూటీషియన్‌ వంటి ఉపాధి విద్యల్లో శిక్షణ ఇప్పించి, ఉపాధికి బాటలు వేస్తున్నారు. 
 
అయితే, ప్రభుత్వ యంత్రాంగం కరోనా నివారణ చర్యల్లో నిమగ్నమైన ప్రస్తుతం తరుణంలో తమ వైపు ఎవరూ రారన్న ఉద్దేశంతో కొందరు బాల్య వివాహాలకు ఒడిగడుగుతున్నారని, తమ దృష్టికి వచ్చినవాటిని ఆపగలుగుతున్నామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు చెప్తున్నారు. బాలల హక్కుల రక్షణ చట్టం ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో పటిష్టంగా అమలవుతున్నట్టు తెలిపారు. పిల్లల ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా పెద్దల ఒప్పంద మేరకే ఈ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.