శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (11:50 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : కాంగ్రెస్ నాలుగో జాబితా రిలీజ్

congress party symbol
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం పోటీ చేసే అభ్యర్థుల పేర్లతో నాలుగు జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. ఇప్పటికే మూడు విడతల్లో 116 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో రెండు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. తాజాగా ఈ రెండు స్థానాలతో పాటు మరో మూడు స్థానాలకు కలిపి మొత్తం ఐదుగురు అభ్యర్థుల పేర్లతో నాలుగు జాబితాను రిలీజ్ చేసింది. కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. నర్సాపూర్, మహేశ్వరం, బాన్సువాడ, నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాల్లోని అసంతృప్తులను స్వయంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుజ్జగించి పార్టీ కోసం కలిసి పని చేయాలని సూచించారు. 
 
దీంతో నాలుగు విడుతల్లో మొత్తం 118 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 118 చోట్ల, మిత్రపక్షమైన సీపీఐ ఒక చోట పోటీ చేస్తున్నాయి. సీపీఎం మాత్రం కూటమి నుంచి వైదొలగి సొంతంగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నాలుగు విడతల్లో తొలి జాబితాలో 55 మంది, రెండో విడతలో 45మంది, మూడో విడతలో 16 మంది, నాలుగు విడతలో ఐదు మంది చొప్పున అభ్యర్థులను ప్రకటించింది.
 
ఈ నాలుగోది అయిన తుది జాబితాలో సీట్లు దక్కించుకున్నవారిలో కాటా శ్రీనివాస్ గౌడ్ (పటాన్ చెరు), బాతుల లక్ష్మారెడ్డి (మిర్యాలగూడ), ముజీబుల్లా షరీఫ్ (చార్మినార్), రాంరెడ్డి దామోదర్ రెడ్డి (సూర్యాపేట), మందుల సామేలు (తుంగతుర్తి)లు ఉన్నారు. వీరంతో శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ పత్రాల గడువు కూడా శుక్రవారంతో ముగియనున్న విషయం తెల్సిందే.