తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : నేడు నామినేషన్ దాఖలకు డెడ్‌లైన్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, నామినేషన్ దాఖలకు గడువు శుక్రవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అనేక మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇప్పటివరకు సమర్పించని అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు చివరి రోజైన శుక్రవారం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉంది. కాగా, ఈ ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న విషయం తెల్సిందే. భారాస, కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తుంటే, బీజేపీ మాత్రం జనసేన పార్టీతో కలిసి పోటీ చేస్తుంది.
మరోవైపు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ల దాఖలకు శుక్రవారంతో గడువు ముగుస్తుందని, కానీ, ఇప్పటివరకు తన పార్టీకి గుర్తును కేటాయించలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను సెప్టెంబర్ నెలలోనే డాక్యుమెంట్లు అన్నీ ఇచ్చానన్నారు. కానీ ఇప్పటివరకు గుర్తును కేటాయించలేదన్నారు.
పార్టీ యాక్టివ్‌గా లేదని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాన్ని కేసీఆర్ నడుపుతున్నారా? ఎన్నికల కమిషనర్ నడుపుతున్నాడా? అన్నది తమకు అర్థం కావడం లేదని విమర్శించారు. అసలు ఎన్నికల్లో పోటీ చేయని షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుర్తును కేటాయించారని, కానీ తమకు కేటాయించలేదన్నారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు.
తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్తే సింబల్ ఏమిటి? అని అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. తనను ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల్లో గుర్తు కోసం తాను నిరాహార దీక్ష చేయాలా? అని ప్రశ్నించారు. హెలికాప్టర్, రింగ్ గుర్తుల్లో ఏది కేటాయిస్తారో చెప్పడం లేదన్నారు. తనకు ఆరు నెలలుగా గుర్తు ఇస్తానని చెబుతున్నారు తప్ప కేటాయించలేదన్నారు.
చట్టాలు మారాలంటే తనలాంటి వాడిని గెలిపించాలన్నారు. తన పోరాటంతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం నిలిచిపోయినట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రజాశాంతి పార్టీకి గుర్తును కేటాయించి నామినేషన్ కోసం మరో రెండు రోజుల సమయం ఇవ్వాలన్నారు. తమకు పార్టీ గుర్తు ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదో ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.