సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2017 (11:18 IST)

రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు... ఇప్పటివరకు రూ.66074.55 కోట్లు

రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆయన మంగళవారం రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ, రోడ్లు వేయొద్దు… కరెంట్ ఇవ్వొద్దు… నీళ్లు రావొద్దు… అభివృద్

రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆయన మంగళవారం రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ, రోడ్లు వేయొద్దు… కరెంట్ ఇవ్వొద్దు… నీళ్లు రావొద్దు… అభివృద్ధి చెందొద్దు అన్నట్టుగా ప్రతిపక్షాలు ప్రవర్తిస్తున్నాయని విమర్శలు గుప్పించారు. 
 
నీళ్లు, ఇళ్ల కోసం అప్పులు చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాల ఆలోచన విధానం మారాలన్నారు. 2014 జూన్ నుంచి నేటికి రూ.66074.55 కోట్లు అప్పు చేశామని సభకు తెలిపారు. అంతకుముందు 2014 జూన్ నాటికి రాష్ట్ర అప్పు రూ.69,479.48 కోట్లు ఉందన్నారు. అభివృద్ధి కోసం చేస్తున్న అప్పులపై ఇష్టానుసారం మాట్లాడటం సబబు కాదన్నారు. 
 
తెలంగాణ ప్రజలను ఈ దేశంలో గొప్ప పౌరులుగా, గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. రూ.40 వేల కోట్లతో ఇంటింటికీ మంచినీరు ఇవ్వబోతున్నామన్నారు. అప్పులు ఇష్టారీతిన తీసుకునే అధికారం రాష్ట్రాలకు లేదని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం, బ్యాంకులు.. అడగ్గానే అప్పులు ఇవ్వడం జరగదన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎమ్ పరిమితికే లోబడి అప్పులు ఇస్తాయన్నారు. 
 
రెవెన్యూ ఖర్చులు తక్కువ చేసిన వారికే అప్పులు ఇవ్వడం జరుగుతుందని మంత్రి ఈటల స్పష్టం చేశారు. జీడీపీలో 41.11 శాతం అప్పులు చేసిన దేశం భారతదేశమని మంత్రి తెలిపారు. ప్రపంచ దేశాల్లో అప్పులు చేసిన దేశంగా జపాన్ అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ గుర్తుచేశారు.