ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (14:00 IST)

ధాన్యం సెంటర్‌కు బయలుదేరిన షర్మిల.. అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ రాష్ట్రంలో ఓ ధాన్యం కొనుగోలు సెంటర్‌ను పరిశీలించడానికి బయలుదేరిన వైఎస్ షర్మిలను ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. కరోనా లాక్డౌన్ నిబంధనలను సాకుగా చూపి ఆమె పర్యటనకు అంతరాయం కలిగించారు.
 
శుక్రవారం రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలంలోని పాలెపల్లి  ఐకేపీ సెంటర్‌లో ధాన్యాన్ని ప‌రిశీలించాలని వైఎస్‌ షర్మిల భావించారు. ఇందుకోసం హైద‌రాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి కారులో బయలుదేరారు. అయితే, ఆమె కాన్వాయ్ వికారాబాద్ జిల్లా చింతపల్లి దగ్గరకు రాగానే పోలీసులు నిలిపివేశారు. 
 
కొవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా షర్మిల కాన్వాయ్‌లో రెండు వాహనాలకే అనుమతి ఉందనీ, నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారంటూ కాన్వాయ్‌లోని ఇతర వాహనాలను చింతపల్లి దగ్గర పోలీసులు నిలిపివేయ‌డంతో ష‌ర్మిల మ‌ద్ద‌తుదారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ష‌ర్మిల‌ మరికాసేపట్లో దోమ మండలం పాలెపల్లికి చేరుకోనున్నారు. 
 
అయితే, ప్ర‌తిపక్ష పార్టీల నేత‌లు అసత్య ప్రచారం చేస్తున్నార‌ని వారిని అడ్డుకుంటామ‌ని టీఆర్ఎస్ శ్రేణులు అంటుండ‌డంతో ఐకేపీ సెంటర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.