ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (12:56 IST)

విద్యార్థులను బలవంతం చేయొద్దు... చర్యలు తీసుకోవద్దు.. హైకోర్టు

సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రాల్లో బడులు తెరుచుకోనున్నాయి. అయితే, కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివున్న ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన సరికాదంటూ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు తెలంగాణ విద్యాసంస్థ‌ల్లో ప్ర‌త్య‌క్ష బోధ‌న‌పై మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. 
 
ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దు అని కోర్టు సూచించింది. ప్రత్యక్ష తరగతులు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దు. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దు అని ప్ర‌భుత్వానికి కోర్టు సూచించింది. 
 
ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే నిర్ణయించుకోవచ్చు అని కోర్టు తెలిపింది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు వారం లోగా మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖ‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇక పాఠ‌శాల‌లు పాటించాల్సిన మార్గ‌ద‌ర్శ‌కాల‌పై విస్తృతం ప్ర‌చారం చేయాల‌ని హైకోర్టు చెప్పింది.
 
అలాగే, గురుకులాలతో పాటు మిగ‌తా హాస్ట‌ళ్ల‌లో ప్ర‌త్య‌క్ష బోధ‌న‌పై హైకోర్టు స్టే విధించింది. గురుకులాలు, విద్యాసంస్థల‌ వసతిగృహాలు తెరవద్దని హైకోర్టు ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.