తెలంగాణలో అసలేం జరుగుతోంది?.. హైదరాబాద్ వచ్చిన కేంద్రబృందం
తెలంగాణ లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో అక్కడ అసలేం జరుగుతుందో తేల్చేందుకు కేంద్రం ప్రత్యేక బృందాన్ని పంపింది.
తెలంగాణలో కోవిడ్-19 నియంత్రణ చర్యల పర్యవేక్షణలో భాగంగా కేంద్ర బృందం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా బృందం సభ్యులు సోమవారం వివిధ ఆస్పత్రుల్లో ల్యాబులను పరిశీలిస్తారు.
కంటైన్‌మెంట్ క్లస్టర్‌లో పర్యటిస్తారు. అక్కడి నుంచి నేరుగా బీఆర్కే భవన్‌లో రాష్ట్ర సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ అవుతారు.
సాయంత్రం గాంధీ ఆస్పత్రిని సందర్శించి అనంతరం గచ్చిబౌలీలోని టిమ్స్ ఆస్పత్రిని సందర్శిస్తారు. అక్కడ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ చేరుకుని ఢిల్లీకి పయనమవుతారు.
కాగా ‘విపత్తు నిర్వహణ చట్టం–2005’ నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఈ బృందాలను ఏర్పాటు చేసిన సంగతి విధితమె. ఇక దేశంలో అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్ జిల్లాల్లో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని థానే నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని హెచ్చరించింది. తెలంగాణతో పాటు గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి.
ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి, కరోనా వైరస్‌పై పరిస్థితిని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నాయి.